కలం, వెబ్ డెస్క్ : కృత్రిమ మేధ (AI) సాంకేతికత ప్రస్తుతం ఒక కీలక పరిణామ దశకు చేరుకుంది. ఇప్పటివరకు కేవలం మన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే చాట్‌బాట్‌లకే పరిమితమైన ఏఐ, ఇప్పుడు స్వయంగా నిర్ణయాలు తీసుకుని పనులు పూర్తి చేసే ఏజెంటిక్ ఏఐ (Agentic AI) స్థాయికి ఎదిగిందని నిపుణులు విశ్లేషిస్తున్నారని సీపీ సజ్జనార్ (CP Sajjanar) తెలిపారు. ఈ స్వయంప్రతిపత్తి కలిగిన డిజిటల్ ఏజెంట్లు ఇప్పటికే బ్యాంకింగ్, వైద్యం, విద్యుత్ గ్రిడ్ల వంటి కీలక రంగాల్లో ప్రవేశించాయి. సాధారణ ఏఐ కేవలం సమాచారాన్ని అందిస్తే, ఈ ఏజెంటిక్ ఏఐ మాత్రం పరిస్థితిని బట్టి ఆచరణాత్మక చర్యలు తీసుకుంటుంది. ఉదాహరణకు వాతావరణం మారితే కిటికీలు మూసివేయడం, బ్యాంకుల్లో అనుమానాస్పద లావాదేవీలను గుర్తించి ఖాతాలను నిలిపివేయడం వంటి పనులను ఇవి సొంతంగానే నిర్వహించగలవు. ఒక సంక్లిష్టమైన పనిని పూర్తి చేయడానికి ఇతర ఏఐ ఏజెంట్లతో చర్చించి సమన్వయం చేసుకోవడం వీటి ప్రత్యేకత. ఈ వివరాలను సీపీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
అయితే ఈ స్వయంప్రతిపత్తి వల్ల ప్రయోజనాలతో పాటు కొన్ని ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. మనిషి ప్రమేయం లేకుండా వేల నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఈ ఏజెంట్లు చేసే చిన్న పొరపాట్లు పెను ప్రమాదాలకు దారి తీయవచ్చు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ వంటి రంగాల్లో క్షణాల్లో భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వీటి ప్రవర్తనను సైబర్ నేరగాళ్లు హైజాక్ చేసే ముప్పు ఉండటంతో పాటు, యజమాని ఆదేశాలను అపార్థం చేసుకుని తప్పుడు మార్గంలో వెళ్లే (Unintended Behaviour) ప్రమాదం కూడా పొంచి ఉంది. అందుకే ఈ సాంకేతికతపై నియంత్రణ కోల్పోకుండా ఉండాలని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ సవాళ్లను అధిగమించేందుకు ఏజెంట్ల నియంత్రణ మనిషి చేతుల్లోనే ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఏఐ ఏజెంట్‌కు (Agentic AI) ఒక ప్రత్యేకమైన డిజిటల్ గుర్తింపు (Identity) ఉండాలని, అవి చేసే ప్రతి కదలికను రికార్డు (Logging) చేయాలని స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల పొరపాట్లు జరిగినప్పుడు బాధ్యులను గుర్తించడం సులభమవుతుంది. ఈ ఏజెంట్లకు ఎంత స్వేచ్ఛ ఇవ్వాలి, ఏ డేటాను వాడాలి అనే అంశాలపై కఠినమైన నిబంధనలు (Governance) రూపొందించాలి. ముఖ్యమైన నిర్ణయాల సమయంలో మనిషి అనుమతి తప్పనిసరి చేసే ‘ట్రస్ట్ ఫ్రేమ్‌వర్క్’లు ఉండాలి. ఆటోమేషన్ ద్వారా పనులు వేగవంతం అవ్వడం ఎంత ముఖ్యమో, భద్రత అంతకంటే ప్రాధాన్యమని, తెలివైన నియంత్రణ లేకపోతే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also: తెలుగు చిత్ర పరిశ్రమకు అండగా ఉంటాం: భట్టి విక్రమార్క
Follow Us On: Sharechat


