కలం, వెబ్ డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) హామీ ఇచ్చారు. గద్దర్ సినీ అవార్డుల (Gaddar Film Awards) కోసం నేటి నుంచి ఫిల్మ్ స్రీనింగ్ జరుగుతున్న నేపథ్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతర్జాతీయ స్థాయిలో ఎదిగి అవార్డులు సాధించుకోవడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని భట్టి అన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం, హైదరాబాద్ నగరం ఎదగాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందుచూపుతో ఓ బ్లూప్రింట్ రూపొందించుకొని ముందుకు వెళ్తుందని భట్టి అన్నారు. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ విజయవంతం కావాలని భట్టి ఆశించారు.
సినీ పరిశ్రమ ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని భట్టి అన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, లా అండ్ ఆర్డర్ పరంగా ఏ అవసరం వచ్చినా, అర్ధరాత్రి తలుపు తట్టినా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బిజీగా ఉన్నందున వాళ్ల తరఫున సందేశం ఇచ్చేందుకు ఈ కార్యక్రమానికి వచ్చినట్లు భట్టి తెలిపారు. ప్రభుత్వం అందించే అవకాశాలను సినీ పరిశ్రమ ఉపయోగించుకోవాలని సూచించారు.
స్థానికంగా ఉన్న టాలెంట్‌ను, వసతులను ఉపయోగించుకొని ముందుకు వెళ్లాలని చెప్పారు. అవార్డుల ఎంపికలో జ్యూరీ సభ్యులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారన్న నమ్మకం ప్రభుత్వానికి ఉందని భట్టి (Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా నిర్ణయాలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. గద్దర్ గురించి మాట్లాడుతూ.. గద్దర్ ఆలోచనలు అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. చివరి రోజుల్లో గద్దర్ స్టూడియోలో ఎక్కువ రోజులు గడిపినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మణిశర్మ, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Read Also: పొంగులేటికి కీలకంగా మారిన ఏదులాపురం మున్సిపాలిటీ
Follow Us On: X(Twitter)


