కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) జిల్లా జక్రాన్ పల్లి మండలం అర్గుల్ గ్రామ ప్రాచీన వేంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగలు పడ్డారు. ఆ దొంగలంతా పిల్లలే కావడం విశేషం. దాదాపు 10 మందికి పైగా పిల్లలు స్వామి వారి నగలు దోపిడీ చేశారు. ఈ విషయం తెలిసి గ్రామస్థులు పిల్లల వెంట పడ్డారు. దీంతో వారంతా ఆంజనేయ స్వామి ఆలయంలో దాక్కున్నారు. గ్రామస్థులు దొంగతనం చేసిన పిల్లలను తాళ్ళతో బంధించి డప్పు వాయిద్యాల నడుమ ఊరంతా ఊరేగించారు.
అయితే ఇదంతా నిజం కాదు.. ఎక్కడా లేని ఓ వింత ఆచారం ఆగ్రామంలో కొనసాగుతుంది. 1928 లో ఆలయం నిర్మించినప్పటి నుండి ఇక్కడ ఏటా జరిగే ఉత్సవాలలో భాగంగా ఈసారి కూడా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి 98వ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ మహోత్సవంలో అందర్నీ ఆకట్టుకునే ఘట్టం “దొంగల దోపు” మహోత్సవం. ముందుగా పిల్లలు దొంగలుగా మారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆభరణాలు, వస్తువులను దొంగిలిస్తారు. గ్రామస్థుల హడావుడితో అదే ఊరిలోని ఆంజనేయ స్వామి దేవాలయంలోకి వారు వెళ్లి దాక్కుంటారు. ఆచారం ప్రకారం గ్రామ ప్రజలు డప్పు వాయిద్యాలతో వెళ్లి దొంగలను పట్టుకొని తాళ్లతో సంకెళ్లు వేసి గ్రామంలో ఊరేగిస్తారు.
పిల్లలను తీసుకువచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. అనంతరం స్వామి వారి వద్దకు వెళ్లి మమ్మల్ని క్షమించు స్వామి తప్పు అయిపోయింది మరొకసారి దొంగతనం చేయము అని క్షమాపణలు చెప్పిస్తారు. సొత్తును తిరిగి ఇవ్వడం స్వామివారిని వేడుకోవడం ఈ ఘట్టమే దొంగల దోపిడీ (Dongala Dopidi) మహోత్సవం. అయితే ఈ తతంగం తాతల నాటి నుండి వస్తుందని అర్చకులు రాజేశ్వర శర్మ తెలిపారు. దీనివల్ల గ్రామంలో అరిష్టం పోయి అందరూ క్షేమంగా ఉండి ఎలాంటి బాధలు కలుగకుండా ఉండేందుకు దొంగల దోపిడీ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు.


