కలం, వెబ్ డెస్క్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలను జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నెల 11న రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల బరిలో ఉన్న జనసేన అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఈ ఎన్నికలు ఒక మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు ఎన్డీయే కూటమిలో భాగంగా బీజేపీ (BJP) అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. ఈ నెల 7, 8 తేదీల్లో ఆయన తెలంగాణలో పర్యటించి, జనసేన అభ్యర్థులతోపాటు బీజేపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ మేరకు పార్టీ ఉపాధ్యక్షులు బొంగునూరి మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్, తెలంగాణ ఇంచార్జి శంకర్‌గౌడ్, రాజలింగం, ఆర్కే సాగర్, ఇతర కీలక నేతలు పాల్గొని ఎన్నికల కార్యాచరణపై చర్చించారు.
తెలంగాణ (Telangana)లోని కొన్ని పట్టణాలపై జనసేన ప్రభావం బాగానే ఉంది. యువత, పవన్ సోషల్ మీడియా సైన్యం జనసేన కోసం పనిచేస్తోంది. నిరుద్యోగ సమస్యలు, పారదర్శక పాలన వంటి అంశాలపై జనసేన నిలదీస్తుండటం యువతను ఆకట్టుకుంటోంది. ఈ ఎన్నికల్లో జనసేన ప్రభావం వల్ల ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఓట్లకు గండి పడే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.


