కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేవలం కేసీఆర్‌ను తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. గురువారం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గురుకులాల్లో పాముకాటులతో, కల్తీ ఆహారం తిని విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా ముఖ్యమంత్రికి చలనం లేదని, కనీసం ఆ చిన్నారుల కుటుంబాలను పరామర్శించిన దాఖలాలు లేవని విమర్శించారు. రైతుల కష్టాల గురించి కానీ, 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి కానీ రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా నోరు మెదపకపోవడం దారుణమన్నారు. నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ (Job Calendar) గురించి ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని ఆయన ఆరోపించారు.
మహిళలకు ఇస్తానన్న రూ. 2500 ఆర్థిక సాయం, పెన్షన్ల పెంపు వంటి ఎన్నికల వాగ్దానాలను ప్రభుత్వం విస్మరించిందని హరీశ్ రావు విమర్శించారు. అటు రిటైర్డ్ ఉద్యోగుల బాధలను పట్టించుకోకపోవడమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన డీఏలు, పీఆర్సీ, డీఆర్సీల గురించి సీఎం రేవంత్ (Revanth Reddy) మాట్లాడకపోవడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా కేవలం కేసీఆర్ మీద బూతులు మాట్లాడటానికే రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని, అభివృద్ధిని పక్కనపెట్టి రాజకీయ కక్షసాధింపులకే సమయాన్ని వెచ్చిస్తున్నారని హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: మొదలైన అల్లువారి పెళ్లి సందడి.. దుబాయ్‌లో గ్రాండ్ పార్టీ!
Follow Us On : WhatsApp


