epaper
Monday, November 17, 2025
epaper

అక్కడ లాలూ కుమార్తె.. ఇక్కడ కేసీఆర్ బిడ్డ

కలం డెస్క్ : రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ముందుగా ఊహించడం కష్టమే. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత(Kavitha), బిహార్‌లో మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య(Rohini Acharya) ఉదంతాలను పరిశీలిస్తే కొన్ని కామన్ అంశాలు కనిపిస్తాయి. కల్వకుంట్ల కవితను పార్టీ సస్పెండ్ చేస్తే.. లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య మాత్రం స్వయంగా ఆమే పార్టీ నుంచి తప్పుకున్నారు. కుటుంబ బంధాన్ని కూడా తెంచుకుంటున్నట్లు బహిరంగంగా ఆమె ప్రకటించారు. ఈ ఇద్దరూ పార్టీతో సంబంధాలను తెంచుకోవడంతో పాటు కుటుంబ సంబంధాలకు దూరం కావడంతో ఆ ప్రభావం ఆ పార్టీలపై పడింది.

పురుషాధిక్యత, లింగ వివక్ష :

వీరిద్దరి రాజకీయాలు, వ్యక్తిగత అంశాల్లో సారూప్యత ఉన్నది. లింగ వివక్ష, రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత, పురుషాధిక్యత.. ఇలాంటివి వీరిద్దరిలో కామన్ అంశాలుగా ఉన్నాయి. కుటుంబ పార్టీలుగా ఉన్న ఆర్జేడీ (రాష్ట్రీయ జనతా దళ్), బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి)లలో వీరికి సముచిత స్థానం లేకపోయిందనేది వారి ఆరోపణలు, అసంతృప్తి. పురుషులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ మహిళలను తక్కువ చేసి చూడడాన్ని ప్రస్తావించారు. సమాజంలో ఆ అసమానతలు, వివక్ష ఉన్నట్లుగానే పార్టీల్లోనూ, కుటుంబ బంధంలోనూ ఉన్నాయని, ఆత్మగౌరవాన్ని తగ్గించుకుని బతకడం తమ వల్ల కాదు.. అంటూ అటు కుటుంబానికి, ఇటు పార్టీకి దూరంగా వెళ్ళిపోయారు. ఈ కారణంగా ఏదో ఒక స్థాయిలో పార్టీలోని, కుటుంబంలోని అంతర్గత విభేదాలు బహిర్గతమై ఒక తరహా సంక్షోభానికి దారితీశాయి.

పార్టీ నుంచి కవిత సస్పెన్షన్ :

తెలంగాణకు పదేండ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్(KCR) ఉన్న సమయంలో ఆయన కుమార్తెగా రాజకీయాల్లోకి వచ్చిన కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సమయంలో తెలంగాణ జాగృతి పేరుతో సాంస్కృతిక రంగంలో తనదైన ముద్ర వేశారు. బతుకమ్మ ఉత్సవాలతో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ గుర్తింపు పొందారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా వ్యవహరించారు. ఆ తర్వాత 2019లో ఓడిపోవడంతో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్ర ఉన్నట్లు సీబీఐ, ఈడీ చార్జిషీట్లలో పేర్కొనడంతో ఆమెను పార్టీ నాయకత్వం దూరంగా ఉంచింది. ఇటీవలే ఆమెను సస్పెండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారని, పదేండ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారని కీర్తిస్తూ ఆయనను తప్పు పట్టకుండా జాగ్రత్త తీసుకున్నారు. కానీ ఆయన చుట్టూ ఉన్న ‘కొన్ని దయ్యాలు’ పార్టీకి చెడ్డపేరు తెస్తున్నాయని పరోక్షంగా హరీశ్‌రావు, జోగినపల్లి సంతోష్ గురించి ప్రస్తావించారు. ఇప్పుడు జాగృతి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణాన్ని బలోపేతం చేసుకుంటూ బీఆర్ఎస్ విధానాలను తప్పుపడుతున్నారు.

కుటుంబ బంధానికి, పార్టీకి రాంరాం :

వృద్ధాప్యంలో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతుంటే ఒక కిడ్నీని దానం చేసిన ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య(Rohini Acharya).. తాజాగా బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర వైఫల్యంతో అటు పార్టీకి, ఇటు కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. పార్టీలో సోదరుడు తేజస్వి యాదవ్ పెత్తనం పెరిగిందని, పురుషాధిక్య భావజాలంతో మహిళలను చిన్నచూపు చూస్తున్నారని, ఒక దశలో తనను చెప్పుడో కొట్టడానికి ప్రయత్నించారని, ఆత్మగౌరవాన్ని వదులుకునేకన్నా పార్టీకి, కుటుంబానికి దూరంగా ఉండడమే ఉత్తమం అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆపదలో ఉన్న సమయంలో మూడేండ్ల క్రితం తండ్రికి కిడ్నీని దానం చేస్తే ఇప్పుడు ‘డర్టీ కిడ్నీ’ అంటూ తేజస్వి వ్యాఖ్యానించడాన్ని రోహిణి జీర్ణించుకోలేకపోయారు. పార్టీలో మహిళలను చిన్నచూపు చూడడాన్ని తప్పుపట్టడంతో పాటు పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి తేజస్వి వ్యవహార శైలి, ఆలోచనా ధోరణే కారణమని వేలెత్తి చూపారు.

Read Also: ఢిల్లీ పేలుడు.. సైనికులు వాడే బుల్లెట్లు లభ్యం

Follow Us on : Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>