కలం, ఖమ్మం బ్యూరో: మున్సిపాలిటీ ఎన్నికలలో చిత్ర విచిత్రమైన పొత్తులు చోటు చేసుకోవడమే కాకుండా ఒకరి బీ ఫామ్‌పై మరొకరు పోటీ చేస్తున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో(Municipal Elections) పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులకు ఆ పార్టీ బీ ఫామ్‌లు ఇవ్వలేదు. ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న పలుకుబడిని బట్టి టీడీపీ నాయకులు ఎన్నికల బరిలోకి దిగారు. స్థానికంగా పార్టీల మధ్య కుదుర్చుకున్న ఒడంబడిక మేరకే పొత్తులు పెట్టుకున్నారు. ప్రధానంగా కొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐ(CPI)తో, మధిరలో కాంగ్రెస్(Congress) పార్టీతో పెట్టుకున్న పొత్తుల్లో కూడా వారికి టీడీపీ(TDP) అభ్యర్థిగా పార్టీ బీ ఫామ్ అందజేయలేదు. దీంతో కొత్తగూడెంలో సీపీఐ బీ-ఫామ్‌తో, మధిరలో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. ఇక్కడి 60 డివిజన్లలో అన్ని పార్టీల అభ్యర్ధులు కలిపి 354 మంది పోటీలో ఉన్నారు. అయితే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పొత్తులు చిత్ర విచిత్రంగా ఉన్నయి. కొత్తగూడెంలో సీపీఐ, టీడీపీ కలిసి బరిలోకి దిగాయి.
కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 60 డివిజన్లలో మొత్తం 807 మంది నామినేషన్లు దాఖలు చేయగా స్క్రూటినీ అనంతరం 588 మంది అభ్యర్థులు ఉన్నారు. 234 మంది ఉపసంహరించుకున్నారు. అశ్వారావు పేటలో ఒక వైపు బీఆర్ఎస్-టీడీపీ, మరోవైపు కాంగ్రెస్-సీపీఎంల మధ్య పొత్తు కుదిరింది. ఏదులాపురం, కల్లూరు, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో సీపీఎం-బీఆర్ఎస్ పొత్తు కుదుర్చుకున్నాయి. ఇల్లెందులో సీపీఐ, సీపీఎం, మాస్ లైన్, బీఆర్ఎస్(BRS) కూటమిగా ఏర్పడ్డాయి. మధిరలో కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భిన్న పార్టీల కలయికలతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నాయి.
కానీ అన్ని రాజకీయ పార్టీలకు భిన్నంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖచ్చితమైన స్టాండ్‌తో ఉన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో గానీ మొన్న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గానీ టీడీపీ పోటీలో లేదు. పార్టీ హైకమాండ్ నిర్ణయం మేరకు అభ్యర్థులను పోటీ పెట్టకుండా విరమించింది. పైగా మరే ఇతర పార్టీకీ రాజకీయంగా మద్దతు తెలపలేదు. పొత్తు కోసం బీజేపీ నాయకత్వం స్థానిక టీడీపీ నాయకులను సంప్రదించినప్పటికీ ప్రయోజనం లేదు. పొత్తుల్లేవని తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జి వాసిరెడ్డి రామనాథం తెగేసి చెప్పారు.
మరోవైపు కూటమికే చెందిన బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. బీజేపీ, జనసేన తమ అభ్యర్థులకు బీ ఫారాలు కేటాయించగా, టీడీపీ మాత్రం బీ ఫారాలు ఇవ్వలేదు. బరిలో నిలిచిన ఆయా పార్టీల అభ్యర్థులు సదరు పార్టీల ఎన్నికల గుర్తులతోనే పోటీలో ఉన్నారు. దీంతో విచిత్రంగా అశ్వారావుపేట మున్సిపాలిటీలో టీడీపీ అభ్యర్థికి బీఆర్ఎస్ పార్టీ బీ ఫారాన్ని ఇచ్చింది. దీంతో టీడీపీ నాయకుడు (అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి) ‘కారు’ గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించనున్నారు. మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తున్న టీడీపీకి చెందినవారు మాత్రం ‘స్వతంత్ర’ అభ్యర్థుల గుర్తులతో పోటీ చేస్తున్నారు.
మూడు సీట్ల కోసం..
కొత్తగూడెం కార్పొరేషన్ లో మూడు డివిజన్లను టీడీపీకి కేటాయించారు. అయితే సీపీఐతో పొత్తు కుదుర్చుకొని పోటీ చేస్తున్న ఆ ముగ్గురు టీడీపీ అభ్యర్థులకు బీ-ఫారాలు సీపీఐ కేటాయించింది. ఆ ముగ్గురు చాలా ఏళ్లుగా సీపీఐతో కలిసి ప్రయాణం చేస్తున్నందున ఆ ముగ్గురు అభ్యర్థులకు తామే బీ ఫారాలు ఇచ్చామని సీపీఐ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో టీడీపీ అభ్యర్థులు కంకి-కొడవలి గుర్తును చూపి, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని అభ్యర్థించాల్సిన చిత్ర విచిత్రాలు ఇక్కడ ఆవిష్కరించాయి.
పొలిటికల్ అనధికారక పొత్తులు
ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో పొలిటికల్ పార్టీల అనధికారక పొత్తులు చర్చనీయాంశంగా మారాయి. కంకి-కొడవలి, కారు గుర్తులపై పోటీ చేస్తున్న అభ్యర్థులు రాజకీయ పార్టీపరంగా టీడీపీకి చెందిన వారైనప్పటీకీ ప్రస్తుతం సాంకేతికంగా సీపీఐ, బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అయితే అసలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇతర పార్టీల గుర్తులతో తమ పార్టీ వారు పోటీలో ఉన్నట్లు సమాచారం ఉందా? లేదా? ఉంటే తీసుకునే చర్యలేంటీ? అనేది వేచి చూడాలి.
పలుకు బడి ఉన్నా.. పార్టీ నిర్ణయం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆశావాహులైన పలుకుబడి కలిగిన టీడీపీకి చెందిన సీనియర్‌లకు సైతం సైకిల్ గుర్తు లేదు. తెలుగు దేశం పార్టీ తీసుకున్న స్టాండ్ వల్ల ఇక్కడి టీడీపీ అభ్యర్థుల ఎన్నికల గుర్తు సైతం మారి పోవడమే అసలు విశేషం. పర్యవసానంగా కొత్తగూడెం కార్పొరేషన్లోని 5, 37, 42 నెంబర్లు గల డివిజన్లలో బరిలోకి వచ్చిన టీడీపీ అభ్యర్థులు సీపీఐకి చెందిన ‘కంకి కొడవలి’ గుర్తుపై పోటీ చేస్తున్నారు. 3 డివిజన్లలో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులకు సీపీఐ పార్టీ బీ ఫారాన్ని ఇచ్చింది. దీంతో టీడీపీ నాయకులైనప్పటికీ కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించాల్సి వస్తోంది.


