కలం, వెబ్‌డెస్క్: భారత కుర్రాళ్లు అదరగొట్టారు(India U19). అద్భుత ఆటతో అండర్–19 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరారు. జింబాబ్వేలోని హరారేలో బుధవారం ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన సెమీస్‌లో 7 వికెట్ల తేడాతో గెలుపొందారు. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ప్రత్యర్థి జట్టు 50 ఓవర్లలో 310 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టు ఆటగాళ్లు ఫైజల్ షినోజాదా(110; 93 బంతుల్లో 15 ఫోర్లు), ఉజైరుల్లా నియాజాయ్(101 నాటౌట్; 86 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలు చేశారు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ చెరో రెండు వికెట్లు తీశారు.
ఛేదనలో యువ భారత్ (India U19) ఆరంభం నుంచే ధాటిగా ఆడింది. ఓపెనర్లు ఆరోన్ జార్జ్ (115; 104 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లు), వైభవ్ సూర్యవంశీ (68; 33 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) మొదటి వికెట్‌కు 57 బంతుల్లోనే 90 పరుగులు జోడించారు. జార్జ్ కాస్త నెమ్మదిగా ఆడగా, సూర్యవంశీ ఎడాపెడా బౌండరీలు, సిక్స్‌లతో చెలరేగాడు. ఈ క్రమంలో 24 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికే వెనుదిరిగాడు.
అనంతరం వచ్చిన కెప్టెన్ ఆయుష్ మాత్రే (62; 59 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో విహాన్ మల్హోత్రా (38 నాటౌట్; 47 బంతుల్లో 3 ఫోర్లు) తోడుగా సెంచరీ పూర్తిచేసుకున్న జార్జ్.. జట్టును సురక్షిత స్థితికి చేర్చి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం వేదాంత్ త్రివేది (5 నాటౌట్) తో కలసి విహాన్ లాంఛనం పూర్తి చేశాడు. భారత్ మరో 53 బంతులుండగానే విజయం సాధించింది. ప్రత్యర్థి బౌలర్లలో ఒమర్జాయ్ 2, జద్రాన్ 1 వికెట్ తీశారు. కప్పుకోసం శుక్రవారం జరిగే తుదిపోరులో ఇంగ్లాండ్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.
- అండర్ –19 వరల్డ్ కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరడం ఇది పదోసారి.
- యువ భారత్ 2016 నుంచి 2026 వరకు వరుసగా ఆరుసార్లు తుదిపోరుకు చేరింది.
- అండర్–19 వరల్డ్ కప్‌లో భారత్‌కు ఇది అత్యధిక లక్ష్య ఛేదన. రెండో స్థానంలో 2002లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ (304 పరుగులు) ఉంది.
- అండర్ 19 వరల్డ్ కప్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు(621) నమోదైన రెండో మ్యాచ్ ఇది. మొదటి స్థానంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా(631) మధ్య 2004లో జరిగిన మ్యాచ్ ఉంది.


