కలం డెస్క్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రక్రియ ముగిసిపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర సర్కార్ దృష్టి సారించింది. భారీ మెజారిటీతో జూబ్లీహిల్స్ స్థానాన్ని కైవశం చేసుకున్నందున ఇదే వేడిలో లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహిస్తే ఫలితాలు అనుకూలంగా ఉంటాయని కాంగ్రెస్ భావిస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సోమవారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై(Local body Elections) చర్చ జరగనున్నది. స్వయంగా ముఖ్యమంత్రే ఈ విషయాన్ని ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో పరోక్షంగా ప్రస్తావించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే అంశంలో లీగల్ చిక్కులు ఉన్నందున ప్రస్తుతం హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పిటిషన్ల విచారణ పెండింగ్‌లో ఉన్నందున వాటిపై స్పష్టత వచ్చే వరకు ఆగకుండా సంక్రాంతి పండుగకల్లా ముగించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ భావన.
పార్టీపరంగా బీసీ రిజర్వేషన్లు ?
స్థానిక సంస్థల ఎన్నికల్లో(Local body Elections) బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించి జీవో విడుదల చేసినా రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకపోవడంతో అమలు ప్రశ్నార్థకంగా మారంది. దీంతో పార్టీపరంగానే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడానికి కాంగ్రెస్ సిద్ధమవుతున్నది. చట్టపరంగా ఎంత రిజర్వేషన్‌ను అమలు చేసినా మిగిలిన శాతాన్ని పార్టీపరంగా కల్పించాలని స్పష్టమైన విధానంతోనే ఉన్నది. ఈ అంశాన్ని మంత్రివర్గంలో చర్చించి ఎప్పటిలోగా స్థానిక ఎన్నికలను నిర్వహించాలనే అంశంపై చర్చించి విధాన నిర్ణయం తీసుకోనున్నది. బీసీలకు ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్‌ను పకడ్బంధీగా అమలు చేయాలన్నది కాంగ్రెస్ ఉద్దేశం. ఈ విషయాన్ని రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో ఢిల్లీలో శనివారం చర్చించినట్లు తెలిసింది.
త్వరలో అఖిలపక్ష సమావేశం :
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై అన్ని పార్టీలు అసెంబ్లీ వేదికగా సమ్మతి తెలియజేసినా రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకపోవడంతో పాటు రాజ్యాంగంలోని 9వ షెడ్యూలుకు సవరణ చేయాల్సిన లీగల్ అంశాల దృష్ట్యా అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నది. అన్ని పార్టీల ప్రతినిధులు వెలిబుచ్చే అభిప్రాయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తు ప్రణాళికను వెల్లడించనున్నది. కాంగ్రెస్ సైతం తన నిర్ణయాన్ని ఈ సమావేశంలో ప్రకటించనున్నది. దీంతో అనివార్యంగా అన్ని పార్టీలూ బీసీలకు సంస్థాగతంగా 42% రిజర్వేషన్ కల్పించేలా ఒత్తిడికి శ్రీకారం చుట్టనున్నది. వ్యతిరేకిస్తే బీసీ ఓటు బ్యాంకుకు దూరమవుతామనే ఆందోళనతో అనివార్యంగా ఆ పార్టీలు సైతం కాంగ్రెస్ ప్రతిపాదనకు సమ్మతి తెలియజేయక తప్పదు.
Read Also: మంత్రివర్గంలోకి నవీన్ యాదవ్?
Follow Us on : Pinterest

