కలం డెస్క్ : జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్(Naveen Yadav)కు మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉన్నది. ఈ నియోజకవర్గ చరిత్రలోనే ఫస్ట్ టైమ్ దాదాపు 25 వేల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపొందారు. ఆర్కిటెక్చర్ డిగ్రీతో పాటు యువకుడైనందున నియోజకవర్గ అభివృద్ధి కీలకం కావడంతో మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న ఆలోచన పీసీసీ స్థాయిలో జరుగుతున్నది. ఇదే విషయాన్ని ఢిల్లీకి వెళ్ళిన సీఎం, డిప్యూటీ సీఎం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుడితో చర్చించి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు వెంటనే మంత్రివర్గంలోకి తీసుకోకపోయినా రెండు ఖాళీలను భర్తీ చేసే సమయానికి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రతిపాదించేలా కసరత్తు జరుగుతున్నది.
యాదవ్ సామాజికవర్గానికి చోటు ?
ప్రస్తుతం మంత్రివర్గంలో యాదవ సామాజికవర్గానికి చెందినవారు లేరు. ఖాళీగా ఉన్న రెండు బెర్తుల్లో ఒకదాన్ని నవీన్ యాదవ్‌కు ఇచ్చే అవకాశమున్నది. మొత్తం 18 మంది మంత్రులకు అవకాశం ఉన్నా రెండు ఖాళీగా ఉన్నాయి. ఆ రెండింటినీ బీసీలకు ఇవ్వాలన్నది కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన. అందులో భాగంగా ఒకదాన్ని యాదవ్ సామాజికవర్గానికి, మరోదాన్ని గౌడ్ సామాజికవర్గానికి ఇవ్వాలని హైకమాండ్ భావిస్తున్నది. ప్రస్తుతం మంత్రివర్గంలో నలుగురు రెడ్డిలు, ఒక కమ్మ, ఒక వెలమ, ఒక బ్రాహ్మణ, నలుగురు ఎస్సీ, ఒక ఎస్టీ, ముగ్గురు బీసీ, ఒక ముస్లిం ఉన్నారు. మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించి ఒకరిద్దరిని బైటకు పంపి పార్టీ అవసరాలకు వినియోగించుకోవాలని కూడా పీసీసీ, ఏఐసీసీ ఆలోచిస్తున్నాయి.
బీసీ నినాదం బలపడే చాన్స్ :
బీసీలకు రాజకీయ, ఆర్థిక, సాంఘిక రంగాల్లో అవకాశం కల్పించాలని కాంగ్రెస్ భావిస్తున్నందున అగ్రవర్ణాలకు, ఎస్సీలకు సమాన స్థాయిలో బీసీలకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలని అనుకుంటున్నది. ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో పార్టీపరంగా స్పష్టమైన విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. దానికి కొనసాగింపుగా బీసీ యువకుడైన నవీన్ యాదవ్(Naveen Yadav)ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా బీసీ రిజర్వేషన్ అంశాన్ని మాటల్లోనే కాక చేతల్లోనూ ప్రదర్శించిందనే పాజిటివ్ మెసేజ్ జనంలోకి వెళ్తుందన్నది కాంగ్రెస్ భావన. తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ కమ్మ సామాజికవర్గానికి చెందిన మాగంటి సునీతను నిలబెడితే, బీజేపీ మ త్రం రెడ్డి సామాజికవర్గానికి చెందిన లంకల దీపక్‌రెడ్డిని నిలబెట్టింది. బీసీ వ్యక్తిగా నవీన్ యాదవ్ ఎంపిక మంత్ర ఫలించిందని, ఇదే సూత్రాన్ని మంత్రివర్గ విస్తరణలోనూ అమలు చేయడం ద్వారా బీసీ ప్రజలకు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చినట్లవుతుందని సమాచారం. త్వరలోనే ఏఐసీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చన్నది పీసీసీ నేతల అభిప్రాయం.
Read Also: కేటీఆర్ సోషల్ మీడియాను వదిలి ప్రజల్లోకి రావాలి: కవిత
Follow Us on : ShareChat

