కలం డెస్క్ : Cyber Crimes | ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో పాటు దాని నుంచి సవాళ్ళూ అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. మనసులోని భావాలను, అధికారిక సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రజలకు చేరవేస్తున్న పోలీస్ ఆఫీసర్లు, ప్రభుత్వంలో వివిధ స్థాయిల్లో ఉన్న ఉన్నతాధికారులను సైబర్ క్రిమినల్స్ టార్గెట్‌గా చేసుకున్నారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా గతంలో పనిచేసిన సీవీ ఆనంద్, ఇప్పుడు కమిషనర్‌గా పనిచేస్తున్న సీవీ సజ్జనార్, సీనియర్ ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా తదితర ఎంతో మందిని సైబర్ క్రిమినల్స్ లక్ష్యంగా చేసుకున్నారు. చివరకు తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ సైతం హ్యాక్‌కు గురైంది.
సైబర్ నేరాల్లో(Cyber Crimes) టాప్ స్టేట్‌గా తెలంగాణ :
సైబర్ నేరాల్లో మరే రాష్ట్రం కంటే ఎక్కువ కేసులతో తెలంగాణ టాప్‌లో ఉన్నది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం గతేడాది (2024లో) మొత్తం 15,297 కేసులు నమోదయ్యాయి. దేశం మొత్తం మీద నమోదైన కేసుల్లో ఇది దాదాపు 40%. అంతకుముందు ఏడాది (2023)తో పోలిస్తే సైబర్ నేరాలు 43.3% పెరిగాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్‌గా హైదరాబాద్ (సైబరాబాద్)కు ప్రత్యేక గుర్తింపు ఉన్నట్లుగానే ఇప్పుడు సైబర్ నేరాల్లోనూ అదే స్థాయిలో ఫిర్యాదులు, కేసులు నమోదు కావడం గమనార్హం. సైబర్ నేరాల్లో బిజినెస్ ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్, ఫేక్ కస్టమర్ కేర్, పార్ట్ టైమ్ జాబ్ స్కామ్, డిజిటల్ అరెస్టులు, క్రెడిట్/డెబిట్ కార్డుల ఫ్రాడ్స్, ప్రముఖ వ్యక్తులుగా గుర్తింపు పొందినవారి పేర్లు, ఫోటోలతో ఎర వేయడం. ఇలాంటి అనేక రూపాల్లో సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి.
అవగాహన కలిగిస్తున్నా… :
సైబర్ నేరాలు ఏయే రూపాల్లో జరుగుతున్నాయో ప్రజలకు పోలీసు శాఖ తరఫున అవగాహన కలిగిస్తున్నా ఈ ఘటనలు ఆగడంలేదు. వాటి మాయలో పడి లక్షలాది రూపాయలను ప్రజలు కోల్పోతున్నారు. నకిలీ ఐడీలను సృష్టించి వాటి పేరుతో పరిచయస్తులకు మెసేజ్‌లను పంపితే రెస్పాండ్ కావొద్దని, ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నా వేర్వేరు కారణాలతో ఆ ఉచ్చులో పడుతున్న బాధితుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నది. సైబర్ నేరాల నివారణకు తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ సెల్‌ను ఏర్పాటు చేశారు. కొన్ని సందర్భాల్లో పోలీసు అధికారులే బాధితులవుతున్నారు. సోషల్ మీడియా వినియోగం పెరుగుతుండడంతో సైబర్ క్రిమినల్స్ సైతం ఆకర్షణీయమైన పద్ధతులను ఎంచుకుని ప్రజలను మాయ చేస్తున్నారు. ఉచ్చులోకి లాగుతున్నారనే అనుమానం కూడా రానంతగా క్రిమినల్స్ కొత్త కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారు.
హైకోర్టు వెబ్ సైట్ హ్యాక్ :
తెలంగాణ హైకోర్టు(TG High Court) వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్ళు దాని స్థానంలో బెట్టింగ్ సైట్‌ను పెట్టారు. రోజువారీ పిటిషన్లు, వాటి విచారణను పూర్తి చేసిన తర్వాత జడ్జీలు వెలువరించే ఉత్తర్వులను లాయర్లు సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే సమయంలోనే హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైంది. వెంటనే అప్రమత్తమైన రిజిస్ట్రార్ ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ సోషల్ మీడియా ఎకౌంట్‌ను సైతం వాడుకుని పరిచయస్తులకు ఆయన ఫోటో, ఐడీని వాడి ఆర్థిక సాయం అందించాలని మెసేజ్‌లు పెట్టారు. దీంతో అప్రమత్తమైన సజ్జనార్… తన అకౌంట్ హ్యాకింగ్ అయిందని, ఎవ్వరూ రెస్పాండ్ కావొద్దని సమాచారం పంపారు. సైబర్ క్రైమ్స్ అంశంలో లోతైన అవగాహన ఉండి ప్రజలను అప్రమత్తం చేసే సజ్జనార్(CP Sajjanar) సోషల్ మీడియా అకౌంట్‌ను సైతం క్రిమినల్స్ టార్గెట్ చేయడం గమనార్హం.
Read Also: ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్ట్
Follow Us on : Pinterest

