కలం, వెబ్ డెస్క్: సోషల్ మీడియా ద్వారా పిల్లలకు ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి రక్షించేందుకు స్పెయిన్ (Spain) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు వయస్సు ఉన్న పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధించనున్నట్లు స్పానిష్ ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్ ప్రకటించారు. మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పిల్లలపై లైంగిక వేధింపులు, అనుమతి లేని అశ్లీల డీప్‌ఫేక్ కంటెంట్ లాంటి కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇకపై ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ గ్లోబల్ టెక్ (Tech) దిగ్గజాలు తమ బాధ్యతను నిర్వర్తించాలని హెచ్చరించారు. పిల్లలు ప్రమాదకరమైన ప్రపంచంలోకి వెళ్తుంటే.. ప్రభుత్వాలు ఇకపై కళ్లు మూసుకుని కూర్చోవు అని స్పష్టం చేశారు.
చాలా యాప్స్‌లో వయస్సును ధృవీకరించేందుకు ఒక ‘చెక్ బాక్స్’ మాత్రమే ఉంటుందని, దానిని పిల్లలు సులభంగా దాటేస్తున్నారని శాంచెజ్ పేర్కొన్నారు. ఇకపై అలా కుదరదని, పక్కాగా వయస్సును నిర్ధారించే సాంకేతిక అడ్డంకులను కంపెనీలు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, డెన్మార్క్ దేశాలు పిల్లల సోషల్ మీడియాపై ఆంక్షలు విధించిన తెలిసిందే. ప్రస్తుతం చాలా వరకు సోషల్ మీడియా (Social Media) సంస్థలు వయస్సును నిబంధనగా పెట్టినప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.


