కలం, వెబ్‌డెస్క్: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ మరో ఘనత సాధించింది. గాలిలో నుంచి గాలిలోకి ప్రయోగించి, లక్ష్యాలను ఛేదించగలిగే లాంగ్రేజ్ గైడెడ్ మిస్సైల్స్ తయారీలో కీలకమైన రామ్‌జెట్ టెక్నాలజీని సక్సెస్‌ఫుల్‌గా పరీక్షించింది (DRDO – Ramjet). మంగళవారం ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ITR) నుంచి ఈ ప్రయోగం విజయంతంగా నిర్వహించింది. ‘సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్‌జెట్’(SFDR) టెక్నాలజీతో మిస్సెల్ను సక్సెస్‌ఫుల్‌గా టెస్ట్ చేసింది.
తూటాలు, క్షిపణుల వేగాన్ని పెంచి, వాటిని మరింత దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలిగేలా ఐఐటీ మద్రాస్ రామ్‌జెట్ టెక్నాలజీని రూపొందించిన సంగతి తెలిసిందే. గాలిని ఆసరాగా చేసుకొని రూపొందించిన ఈ టెక్నాలజీని ఇప్పుడు డీఆర్డీవో మిస్సైల్‌కు అమర్చి పరీక్షించింది.
ప్రయోగంలో భాగంగా నాజిల్లెస్ బూస్టర్, ఘన ఇంధనంతో ఉన్న సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్‌జెట్ మోటార్, ఫ్యూయల్ ఫ్లో కంట్రోలర్ వంటి అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేసినట్లు గుర్తించారు. ఐటీఆర్ ఏర్పాటుచేసిన ట్రాకింగ్ పరికరాలు మిస్సైల్‌ను ట్రాక్ చేసి, ప్రయోగం సక్సెస్ అయినట్లు తేల్చాయి(DRDO – Ramjet).
కాగా, ‘ఎస్ఎఫ్డీఆర్’ ప్రొపల్షన్ వ్యవస్థ పరీక్ష విజయవంతం కావడంతో శత్రు దేశాల్లోని టార్గెట్లను, క్షిపణులను మరింత దూరం నుంచే అడ్డుకోగల సామర్థ్యం భారత్‌కు సొంతమైంది.


