epaper
Wednesday, February 18, 2026
epaper

కాంగ్రెస్ హయాంలో రౌడీల రాజ్యం : బీజేపీ ఖమ్మం అధ్యక్షుడు కోటేశ్వరరావు

కలం/ఖమ్మం బ్యూరో : కాంగ్రెస్ హయాంలో రౌడీల రాజ్యం నడుస్తోందన్నారు బీజేపీ ఖమ్మం (Khammam) జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వర రావు. ఓటమి భయంతో ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, కిడ్నాప్ రాజకీయాలకు తెరతీస్తున్నాయని మండిపడ్డారు. ఏదులాపురం మున్సిపాలిటీలోని బీజేపీ ఆఫీస్ లో మంగళవారం కోటేశ్వర రావు మీడియాతో మాట్లాడారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో బీజేపీ తరఫున నిలబడిన అభ్యర్థిని నామినేషన్ల ఉపసంహరణ గడువు (మధ్యాహ్నం 3 గంటలు) ముగిసిన తర్వాత ప్రత్యర్థి పార్టీల నాయకులు కిడ్నాప్ చేసినట్టు నెల్లూరి ఆరోపించారు. అధికార కాంగ్రెస్, తోక పార్టీలైన కమ్యూనిస్టులు, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటై బీజేపీని ఎదుర్కోలేక నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దమ్ముంటే ప్రజల్లో తేల్చుకోండి..

దమ్ముంటే ప్రజాస్వామ్యయుతంగా ప్రజల దగ్గరికి వెళ్లి, వారి ఆశీర్వాదంతో గెలవాలి తప్ప.. ఇలా అభ్యర్థులను కిడ్నాప్ చేసి కాదు,” అని నెల్లూరి కోటేశ్వర రావు సవాల్ విసిరారు. నైతికంగా బీజేపీ ఇక్కడ గెలిచిందని, అభ్యర్థులను మాయం చేసినంత మాత్రాన ప్రజాభిమానాన్ని మాయం చేయలేరని స్పష్టం చేశారు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే బీజేపీ కార్యకర్తలు ఇటువంటి బెదిరింపులకు లొంగరని నెల్లూరి తెలిపారు.

ఎన్నికల సంఘానికి ఫిర్యాదు..

ఈ ఘటనపై పోలీసులకు , రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు నెల్లూరి కోటేశ్వర రావు. కిడ్నాప్ కు పాల్పడిన పార్టీ అభ్యర్థిని తక్షణమే అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును, పోటీ చేసే హక్కును కాలరాస్తే చూస్తూ ఊరుకోబోమని, దీనిపై న్యాయపరమైన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థులు గెలుస్తున్నారనే భయంతోనే కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, బీఆర్ఎస్ లు ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాయని, రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ధి చెబుతారని నెల్లూరి కోటేశ్వరరావు హెచ్చరించారు.

Khammam
Khammam

Read Also: మున్సిపల్​ ఎన్నికల్లో కాంగ్రెస్​కు బుద్ధి చెప్పాలి : కేటీఆర్​

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>