కలం డెస్క్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన నిజమైంది. బీజేపీ తరఫున పోటీ చేసిన లంకల దీపక్‌రెడ్డి 15 వేల ఓట్లను కూడా పొందలేకపోయారు. దీంతో ఆయన డిపాజిట్ కోల్పోయారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో (ఉప ఎన్నికల్లోనూ) తరచూ మనం ‘డిపాజిట్(Election Deposit)’ అనే పదాన్ని వింటూ ఉంటాం. ఇంతకూ ఈ డిపాజిట్ అనేదాన్ని ఎన్నికలప్పుడు ఏ అర్థంలో వాడుతారు? దానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నిర్వచనం ఏంటో పరిశీలిద్దాం.
పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్‌తో పాటు కొంత డిపాజిట్‌ను డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. దీన్నే డిపాజిట్ అంటారు. మొత్తం పోలైన ఓట్లలో నిర్దేశించిన తీరులో ఓట్లను పొందగలిగితే వారు కట్టిన డిపాజిట్‌ను ఎలక్షన్ కమిషన్ తిరిగి చెల్లిస్తుంది. ఆ మేరకు ఓట్లు రాకపోతే ఆ డిపాజిట్ ను సదరు అభ్యర్థికి చెల్లించదు. దీన్నే డిపాజిట్ అంటారు. పార్లమెంటు ఎన్నికల్లో సాధారణ అభ్యర్థులు రూ. 25 వేలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ. 12,500 చొప్పున డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధారణ అభ్యర్థులు రూ. 10 వేలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ. 5 వేల చొప్పున డిపాజిట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఆ అభ్యర్థులు నిర్ణీత స్థాయిలో ఓట్లను రాబట్టలేకపోయినట్లయితే ఆ డిపాజిట్‌ను సదరు అభ్యర్థులకు ఎలక్షన్ కమిషన్ తిరిగి ఇవ్వదు.
ఎన్ని ఓట్ల వస్తే డిపాజిట్ వచ్చినట్లు?
పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో (ఉప ఎన్నికలు సహా) మొత్తం పోలైన ఓట్లలో ఆరవ వంతు (16.67%) అభ్యర్థి పొందాల్సి ఉంటుంది. అప్పుడే సదరు అభ్యర్థికి డిపాజిట్ వచ్చినట్లుగా ఎలక్షన్ కమిషన్ భావిస్తుంది. అప్పుడే వారు నామినేషన్‌తో పాటు కట్టిన డిపాజిట్ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుంది. లేదంటే సదరు అభ్యర్థి డిపాజిట్ దక్కించుకోలేదని ప్రకటిస్తుంది. ఉదాహరణకు తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా ఈ నెల 11న జరిగిన పోలింగ్‌లో 1,94,631 ఓట్లు (48.49%) పోల్ అయ్యాయి. ఇందులో 16.67% మేర ఓట్లు దక్కించుకుంటే వారు డిపాజిట్ పొందినట్లు ఎన్నికల సంఘం నిర్ధారిస్తుంది. ఆ ప్రకారం అభ్యర్థులకు 32,445 ఓట్లు వస్తే వారు డిపాజిట్ దక్కించుకున్నట్లవుతుంది. ఈ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీచేశారు. ఇందులో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మినహా మిగిలినవారంతా డిపాజిట్ కోల్పోయారు.
బీజేపీ అభ్యర్థి డిపాజిట్(Election Deposit) గల్లంతు :
బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి14,243 ఓట్లను మాత్రమే పొందారు. మూడవ స్థానంలో నిలిచినప్పటికీ డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. పోలైన ఓట్లలో 16.67% మేరకు 32,445 ఓట్లు వస్తే డిపాజిట్ దక్కినట్లయ్యేది. కానీ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లుగానే బీజేపీ ఈసారి డిపాజిట్ కూడా పొందలేకపోయింది. మొత్తం 58 మంది అభ్యర్థుల్లో ఇద్దరు మినహా మిగిలిన 56 మందీ డిపాజిట్ కోల్పయోయారు. వీరు కట్టిన డిపాజిట్ మొత్తం ఎన్నికల సంఘం దగ్గరే ఉండిపోతుంది.
Read Also: పవన్ కల్యాణ్‌లా చిరాగ్ పాశ్వాన్ .. స్ట్రైక్ రేట్ 100 శాతం !
Follow Us on: Youtube

