అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, ఉత్కంఠ భరితంగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వల్లాల నవీన్ యాదవ్(Naveen Yadav) ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత(Maganti Sunitha) మీద 24771 ఓట్ల మెజార్టీ సాధించారు. నవీన్ యాదవ్ మొదటి రౌండ్ నుంచి తన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. బస్తీలు, అపార్ట్ మెంట్లు అనే తేడా లేకుండా అన్ని డివిజన్లలోనూ మెజార్టీ సాధించారు.
కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం
ఇది కాంగ్రెస్ శ్రేణుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వానికి ఈ ఫలితం సరికొత్త బలం ఇవ్వనున్నది. ఎన్నికల సంఘం (ఈసీ) అధికారికంగా విజయాన్ని ప్రకటించాల్సి ఉండగా, ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే నవీన్ యాదవ్(Naveen Yadav) విజేతగా అనధికారికంగా నిర్ధారణ అయింది.
రౌండ్ రౌండ్‌కూ కాంగ్రెస్ ఆధిపత్యం
ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మొదటి రౌండ్ నుంచే నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు. ప్రతి రౌండ్‌తో ఆ ఆధిక్యం మరింత పెరిగింది. మొత్తం రౌండ్లలో ఏ ఒక్క రౌండ్‌లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత లీడ్ తీసుకోలేకపోయారు. బీజేపీ అభ్యర్థి డిపాజిట్ కూడా కోల్పోయారు.
ఏ పార్టీ ఎన్ని ఓట్లు సాధించింది?
10 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ 98,945 ఓట్లు సాధించగా.. బీఆర్ఎస్ 74,259 ఓట్లను బీజేపీ అత్యల్పంగా 17061 ఓట్లను సాధించింది. ఇక ఇతర అభ్యర్థులు అందరికీ కలిపి 4419 ఓట్లు సాధించారు.
ఓటమి నుంచి గెలుపువైపు అడుగులు
నవీన్ యాదవ్ రాజకీయ ప్రస్థానం ఓటమి నుంచే మొదలైంది. ఓటములను సోపానాలుగా చేసుకొని గెలుపువైపు పయనించారు. ఆయన 2009లో యూసుఫ్‌గూడ డివిజన్ కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి నుంచి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి 41,656 ఓట్లు సాధించారు. 2015లో రహ్మత్‌నగర్ డివిజన్ కార్పొరేటర్‌గా మళ్లీ ఓటమి పాలయ్యారు. 2018లో జూబ్లీహిల్స్(Jubilee Hills) ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 18,817 ఓట్లు సాధించారు. 2023 నవంబర్ 15న రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. నవీన్ యాదవ్ కుటుంబానికి స్థానికంగా మంచి సంబంధాలు ఉండటం, బస్తీ సమస్యల మీద అవగాహన ఉండటం ఆయనకు కలిసివచ్చింది.
Read Also: మహాగఠ్‌బంధన్ అస్తమిస్తుంది.. బీజేపీ సెటైర్లు
Follow Us on: Youtube

