కలం, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని కుదిపేస్తున్న ‘ఎప్స్టీన్ సెక్స్ స్కాండల్’ (Epstein Files) వ్యవహారం లోక్‌సభను తాకింది. ఈ కుంభకోణానికి సంబంధించి అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ‘ఫైల్స్’లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరు ప్రస్తావనతోపాటు పీఎం హోదాలో ఆయన ఇజ్రాయెల్‌కు వెళ్లిన పర్యటన వివరాలు ఉండడంపై ప్రభుత్వ వివరణ కోరుతూ కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. సోమవారం ఉదయం సభ ప్రారంభమైన కాసేపటికే కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్స్టీన్ ఫైల్స్‌లో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన వివరాలు ఉండడం ఆందోళనకరమన్నారు. ఇది దేశ అంతర్జాతీయ ప్రతిష్ఠ, నైతికత, రాజ్యంగ విశ్వసనీయతపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు.
“ ఎప్స్టీన్ ఫైల్స్‌లో.. 2017 జులై 9న ఎప్స్టీన్ రాసినట్లుగా చెబుతున్న ఓ మెయిల్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ పర్యటనకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఇది అంతర్జాతీయంగా భారత దౌత్య అంశాలపై ప్రభావం చూపిస్తుంది. అనేక ఊహాగానాలకు, ప్రశ్నలకు అవకాశమిస్తోంది. దీనిపై సభ మౌనంగా ఉండడం సరికాదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన, కచ్చితమైన, అధికారిక వివరణ కావాలి’’ అని మాణిక్యం ఠాగూర్ పేర్కొన్నారు.
‘ఎప్స్టీన్ పేరుతో వచ్చిన ఈ ఫైల్స్‌లోని సమాచారం నిజమైనదని ప్రభుత్వం ధ్రువీకరిస్తోందా? అలాగే భారత ప్రధాని లేదా ప్రభుత్వంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ నిందితునికి సంబంధం ఉందా?’ అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు.
కాగా, ఎప్స్టీన్ ఫైల్స్ (Epstein Files) లో ప్రధాని పేరు ప్రస్తావనపై అంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ‘2017 జూలైలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌కు వెళ్లిన అధికారిక పర్యటన వాస్తవం. కానీ, ఆ ఈ మెయిల్‌లో ఉన్న మిగిలిన అంశాలన్నీ ఒక నేరస్థుడి అర్థంలేని ఊహాగానాలే’ అని విదేశాంగ శాఖ మీడియా ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.
Read Also: తడిచెర్ల కోల్ బ్లాక్ కేటాయింపు.. రాజ్యసభలో ఎంపీ ప్రశ్న
Follow Us On: X(Twitter)


