epaper
Monday, February 2, 2026
spot_img
epaper

సిట్ చీఫ్ సజ్జనార్‌పై హ‌రీశ్ రావు ఫైర్‌

క‌లం, వెబ్ డెస్క్‌: రాజ్యాంగం ప్రకారం పోలీసుల పని కేవలం విచార‌ణ చేయ‌డ‌మేన‌ని, తీర్పులు ఇవ్వడానికి మీరేమీ న్యాయమూర్తులు కాదని మాజీ మంత్రి హ‌రీశ్ (Harish Rao) రావు వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) విచార‌ణ‌పై స్పందిస్తూ సిట్ చీఫ్ స‌జ్జ‌నార్ (Sajjanar) ఎక్స్ వేదిక‌గా చేసిన ఓ పోస్టుపై హ‌రీశ్ రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విచారణ ఇంకా నడుస్తుండగానే స‌జ్జ‌నార్ దీన్ని ఇల్లీగల్ అని ఫిక్స్ అయ్యారంటే ముందే ఒక నిర్ణయానికి వచ్చారా? అని ప్ర‌శ్నించారు. ప్రతిపక్ష నేతకు గౌరవం ఇవ్వకపోవడమే మీ సంస్కార‌మా? అని నిల‌దీశారు. ఖాకీ డ్రెస్ వేసుకొని రాజకీయ అజెండాలు అమలు చేయడం ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్‌కు విరుద్ధమని మీకు తెలియదా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తీర్పులు చెప్పాల్సింది కోర్టులు కానీ పోలీసులు కాద‌ని హ‌రీశ్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కోర్టు విచారణ జరిపి తుది తీర్పు ఇవ్వకముందే సజ్జనార్ అధికారికంగా ‘ఇల్లీగల్’ అని ప్రకటించడం బాధ్యతరాహిత్య‌మ‌ని మండిప‌డ్డారు.

ప్రజాస్వామ్యంలో కోర్టు నిర్ధారించే వరకు ఏ ఆరోపణను కూడా నేరంగా చూడకూడదనేది కనీస న్యాయ సూత్ర‌మ‌ని హ‌రీశ్ రావు అన్నారు. స‌జ్జ‌నార్‌ ఈ న్యాయ సూత్రాన్ని పాటించకపోవడం శోచనీయ‌మ‌న్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ప్రాథమిక హక్కుల‌ను స‌జ్జ‌నార్ విస్మ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. పోలీసుల పని కేవలం దర్యాప్తు చేయడం మాత్రమేన‌ని, విచారణ దశలోనే ఒక అంశాన్ని చట్టవిరుద్ధమని ప్రకటించడానికి మీరేమీ న్యాయమూర్తులు కాద‌ని వ్యాఖ్యానించారు. అసలు ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమా కాదా అనేది ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 5(2), ఐటీ చట్టం, సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం జరిగిందా? లేదా? అన్నదానిపై ఆధారపడి ఉంటుందని హ‌రీశ్ అన్నారు. ఇందులో ఏదైనా ఉల్లంఘన జరిగితే అది కోర్టు విచారణ ద్వారానే తేలాలి తప్ప, పోలీసుల అధికారిక ప్రకటనల ద్వారా కాద‌న్నారు.

సజ్జనార్ ఎక్స్ వేదిక‌గా చేసిన పోస్టులో ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అనే పదాన్ని వాడటం చూస్తుంటే, దర్యాప్తు ఫలితంపై ముందే ఒక నిర్ణయానికి వచ్చారని అర్థమవుతోంద‌న్నారు. మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడికి సంబంధించిన అంశంలో ఇలాంటి తొందరపాటు ప్రకటనలు చూస్తుంటే ఇది పక్షపాతంతో కూడిన రాజకీయ ప్రేరేపిత దర్యాప్తు అని స్పష్టం అవుతున్నద‌ని హరీశ్ రావు అనుమానం వ్య‌క్తం చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అనేది నిష్పాక్షికంగా ఉండటమే కాదు, ఉన్నట్లు కనిపించాలని కూడా సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింద‌ని హ‌రీశ్ రావు (Harish Rao) గుర్తు చేశారు. సిట్ చీఫ్ విచారణకు ముందే దోషులు ఎవరో నిర్ణయిస్తే చట్టాలు ఎందుకు, కోర్టులో ఎందుకు అని ప్ర‌శ్నించారు. స‌జ్జ‌నార్ ఎక్స్ వేదిక‌గా చేసిన పోస్టులో కేసీఆర్‌కు క‌నీసం ప్రతిపక్ష నాయకుడ‌న్న గౌర‌వం కూడా ఇవ్వ‌డానికి ఇష్టపడకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? అని ప్ర‌శ్నించారు. ఒక మాజీ ముఖ్యమంత్రికి, ప్రస్తుత ప్రతిపక్ష నేతకు ఇవ్వాల్సిన కనీస గౌరవం ఇవ్వకపోవడం ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అని స‌జ్జనార్‌ను నిల‌దీశారు.

Read Also: విచార‌ణ‌కు ఎందుకు భ‌య‌ప‌డుతున్నావ్.. కేటీఆర్‌కు క‌విత సూటి ప్ర‌శ్న‌

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>