తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి? ఇదో పెద్దగా ప్రశ్నగానే మిగిలిపోయింది. బీసీ రిజర్వేషన్ల అంశం, కోర్టు కేసులు వంటి ఇబ్బందులతో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ఈ అంశంపై స్పందించారు. న్యాయస్థానం సూచనలకు అనుగుణంగానే తాము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనేక అంశాలపై స్పందించారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ.. “ఈ రోజుల్లో రిగ్గింగ్ అనే పదమే తప్పు. ఇది పాత జమానా కాదు. ఇప్పుడు టెక్నాలజీ యుగం. ప్రతి ఓటు కంట్రోల్‌లో ఉంటుంది. ఎవరూ ఎవరి ఓటును మార్చలేరు.’ అని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ పద్ధతుల వల్ల ఎన్నికల పారదర్శకత పెరిగిందని చెప్పారు.
“ఓడిపోతున్నామనే భయం, అసహనం వల్లే బీఆర్ఎస్(BRS) నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు,” అంటూ మహేశ్ విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో మంత్రులు, ఇన్‌చార్జ్‌లు, స్థానిక నాయకులు ప్రతీ ఒక్కరూ కష్టపడ్డారని పేర్కొన్నారు. ‘పోలింగ్ శాతం మరింత పెరగాల్సింది. ముఖ్యంగా యువత, పట్టణ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది,” అని అన్నారు.
మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వమే
రాష్ట్రంలో ప్రజల మద్దతు కాంగ్రెస్ వైపు ఉన్నదని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు. “ప్రస్తుతం తెలంగాణలో స్పష్టమైన పాజిటివ్ వేవ్ ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నాం. ప్రజలు ఈ మార్పును గమనిస్తున్నారు,” అని తెలిపారు. కేబినెట్ విస్తరణ, మార్పులు అధిష్ఠానం పరిధిలో ఉన్నాయని అన్నారు. డీసీసీ అధ్యక్షుల ప్రకటన కూడా త్వరలోనే ఉంటుందని సూచించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించిందని, అయితే కేంద్రంలోని బీజేపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు. “బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేక్ సర్వేలు ప్రచారం చేస్తూ తాత్కాలిక మానసిక ఉపశమనం పొందుతోంది. కానీ ప్రజలు నిజాన్ని గుర్తిస్తున్నారు,” అని మహేశ్ గౌడ్(Mahesh Kumar Goud) వ్యాఖ్యానించారు.
Read Also: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు
Follow Us on : Pinterest

