కలం, వెబ్‌డెస్క్: ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఒక్కో రాజ్యాంగ వ్యవస్థను క్రమపద్ధతిలో నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఆరోపించారు. ఇదే కోవలో ఇటీవల మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నాశనం చేసిందని, ఇప్పుడు సమాచార హక్కు చట్టాన్నీ (ఆర్టీఐ) ఇలాగే హత్య చేయాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు.
గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ఆర్టీఐని ‘రీ–ఎగ్జామినేషన్’ చేయాలని పేర్కొన్నారు. దీన్ని ప్రస్తావిస్తూ ఖర్గే కేంద్ర ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. ఆర్టీఐని రీ–ఎగ్జామినేషన్ (పున: పరిశీలన) చేయడం అంటే ఆ చట్టాన్ని పూర్తిగా హత్య చేసే ప్రయత్నమేనని ఖర్గే అన్నారు. ప్రభుత్వం గురించి, ప్రభుత్వ పథకాలు, బదిలీలు, నిధుల వంటి వాటి గురించి ప్రజలకు తెలియకుండా ఉండేందుకు ఇది ‘మినిస్టీరియల్ వీటో’లా రక్షణ కల్పించడమేనని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీఐని ఎలా నిర్వీర్యం చేస్తోందో చెబుతూ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.
100 మంది సహ కార్యకర్తలను చంపారు..
ఆర్టీఐ చట్టాన్ని మోదీ ప్రభుత్వం హ్యాక్ చేసిందని, సమచార కమిషనర్ పదవీకాలం, వేతనంపై నియంత్రణ విధించి, అదుపులోకి తెచ్చుకుందని ఖర్గే (Mallikarjun Kharge) ఆరోపించారు. గత పదకొండేళ్లలో 7సార్లు ఆర్టీఐ చీఫ్ కమిషనర్ పదవి ఖాళీ ఉందన్నారు. 2025 నాటికి 26వేలకు పైగా ఆర్టీఐ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. మోదీ హయాంలో 2014 నుంచి ఇప్పటివకు 100 మందికి పైగా సహ చట్టం కార్యకర్తలు హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. అవినీతిని, అక్రమాలను వెలికితీయాలనుకునే వాళ్లను భయభ్రాంతులకు గురిచేసే వాతావరణాన్ని సృష్టించిందని మండిపడ్డారు. పాలకులు, ప్రజాసేవకుల అవినీతిని, అధికారాన్ని దుర్వినియోగాన్ని, నేరాలను బయటపెట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ‘విజిల్‌బ్లోయర్ యాక్ట్–2014’ ను బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ ఆమోదించలేదని ఆ ట్వీట్లో ఖర్గే పేర్కొన్నారు.
Read Also: ఐటీ సోదాల వేళ.. కాన్ఫిడెంట్ గ్రూప్ సీఈఓ ఆత్మహత్య
Follow Us On: Youtube


