కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్మాణమైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లన్నీ (Double Bedroom Houses) ఇకపైన తెలంగాణ హౌజింగ్ కార్పొరేషన్ పరిధిలోకి రానున్నాయి. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి జీవో జారీ చేశారు. గత ప్రభుత్వంలో నిర్మాణమైన, ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న ఇండ్లపై ఇటీవల రోడ్లు భవనాల శాఖ రివ్యూ చేసింది. ఏయే జిల్లాల్లో వాటి ప్రోగ్రెస్ ఏ స్థాయిలో ఉన్నదో అధికారులు సమీక్షించారు. అనంతరం ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయా జిల్లాల్లోని కలెక్టర్లు, జీహెచ్ఎంసీ పరిధిలోని ఇండ్లను కమిషనర్ స్వాధీనం చేసుకునేలా చీఫ్ సెక్రటరీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌ను అమలు చేయడానికి ముందే గత ప్రభుత్వం చేపట్టిన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రోగ్రెస్పైనా సమీక్షించింది. లబ్ధిదారులకు అందజేయడానికి అవసరమైన మార్గదర్శకాలమీదా లోతుగా చర్చించింది.
ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల పథకం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రారంభమైంది. గత ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో డబుల్ ఇండ్ల (Double Bedroom Houses) నిర్మాణాన్ని పూర్తి చేసినా లబ్ధిదారుల ఎంపికలో జరుగుతున్న జాప్యంతో వాటిని కేటాయించడంలో సమస్యలు తలెత్తాయి. ఈ కారణంగా అవి నిరుపయోగమయ్యాయి. కొన్ని చోట్ల కిటికీలు, తలుపులు కూడా మాయమవుతున్నాయి. వీటిని భద్రంగా కాపాడుకోవడం కూడా ప్రభుత్వ సిబ్బందికి తలనొప్పిగా మారింది. ఇలాంటి పరిణామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం దిద్దుబాటు చర్యలపై దృష్టి సారించింది. అందులో భాగంగానే ఈ ఇండ్లను తెలంగాణ హౌజింగ్ కార్పొరేషన్ (Telangana Housing Corporation) పరిధిలోకి తేవడం ఉత్తమమని భావించింది. ఆ ప్రకారమే చీఫ్ సెక్రటరీ వాటిని స్వాధీనం చేసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు, జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
Read Also: ఎన్నికల రాష్ట్రాలపై నిర్మలమ్మ ప్రేమ !
Follow Us On: Sharechat


