కలం, వెబ్ డెస్క్: భారత అథ్లెటిక్స్ దిగ్గజం, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, ఎంపీ పీటీ ఉష(PT Usha) ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త వి.శ్రీనివాసన్(Srinivasan) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. నివేదికల ప్రకారం, థిక్కోడి పెరుమల్పురంలోని నివాసంలో అర్ధరాత్రి 12:30 సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఆకస్మిక ఘటన క్రీడాలోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
కేరళ(Kerala)లోని పొన్నాని వాసి అయిన శ్రీనివాసన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసి పదవీ విరమణ పొందారు. పీటీ ఉష క్రీడా జీవితంలోనూ, ప్రజా జీవితంలోనూ ఆయన స్థిరమైన తోడుగా నిలిచినట్లు కుటుంబ సన్నిహితులు పేర్కొన్నారు. 1991లో పీటీ ఉషను వివాహం చేసుకున్న శ్రీనివాసన్, అప్పట్లో సీఐఎస్ఎఫ్లో ఇంగ్లీష్ ఇన్స్పెక్టర్గా సేవలందించారు. కీలక సందర్భాల్లో ఉషతో ఆయన కలిసి కనిపించేవారని సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీటీ ఉషకు ఫోన్ చేసి మాట్లాడారు. శ్రీనివాసన్ మృతి పట్ల సంతాపం తెలిపారు. పలువురు నేతలు, మాజీ క్రీడాకారులు, క్రీడా సంస్థలు ఉష కుటుంబానికి సంఘీభావం ప్రకటించాయి. పీటీ ఉష(PT Usha), శ్రీనివాసన్లకు విఘ్నేశ్ ఉజ్జ్వల్ అనే కుమారుడు ఉన్నారు.


