కలం, తెలంగాణ బ్యూరో: అమెరికా ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ కు కొత్త చీఫ్ (New Fed Chief) రానున్నారన్న వార్తల నేపథ్యంలో అక్కడి స్టాక్ మార్కెట్లతో పాటు భారతీయ షేర్ మార్కెట్ పతనమయ్యాయి. డొనాల్డ్ ట్రంప్ ఏ క్షణమైనా న్యూ చీఫ్ ను ప్రకటిస్తారని తెలుస్తున్నది. ప్రస్తుతం ఉన్న చీఫ్ జెరోమ్ పావెల్ (Jerome Powell) పదవీ కాలం ఈ ఏడాది మే నెలతో ముగుస్తుంది. ఈలోపే కొత్త చైర్మన్ ను నియమించాలని ట్రంప్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆయన రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేసినప్పటి నుంచి పావెల్ పై కోపంతో ఉన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను పావెల్ దెబ్బతీస్తున్నారని, చెప్పినా వినకుండా వడ్డీ రేట్లను తగ్గించడం లేదని మండిపడుతున్నారు.
అయితే.. ట్రంప్ మాటలను లెక్క చేయకుండా, రూల్స్ ప్రకారమే ఫెడ్ చైర్మన్ పావెల్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉన్నట్టుండి వడ్డీ రేట్లు తగ్గిస్తే.. ద్రవ్యోల్బణం కారణంగా అసలుకే ఎసరు వస్తుందని ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కొత్త చీఫ్ రాక కారణంగా అమెరికా స్టాక్ మార్కెట్లలోని కీలక ఇండెక్స్ లు డౌజోన్స్, నాస్ డాక్ లు 1శాతం మేర కుప్పకూలాయి. ఇండియన్ షేర్ మార్కెట్లలోని కీలక ఇండెక్స్ లైన సెన్సెక్స్ , నిఫ్టీ 50 కూడా శుక్రవారం ఇంట్రాడేలో దాదాపు అర శాతం మేర పడిపోయాయి. అయితే.. కొత్త చైర్మన్ ఎవరు అని తేలితే మాత్రం స్టాక్ మార్కెట్లకు బూస్టప్ ఉండొచ్చని కూడా అమెరికా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
చైర్మన్ ఎన్నిక ఇలా..!
భారత్ లోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఎంత కీలకమైందో.. అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ అంతే కీలకమైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను శాసించడానికి ఇది అమెరికాకు అస్త్రంగా కూడా పనిచేస్తుంది. వాషింగ్టన్ డీసీ కేంద్రంగా దీని కార్యకలాపాలు సాగుతుంటాయి. ఏటా 8 సార్లు ఫెడ్ గవర్నింగ్ బాడీ భేటీ అవుతుంది. ఆర్థిక వ్యవస్థను అంచనా వేసే.. భవిష్యత్తుకు సంబంధించి, ముఖ్యంగా వడ్డీ రేట్లు పెంచాలా, తగ్గించాలా అనే దానిపై కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే ఓ సమావేశం ముగిసింది. మార్చిలో మరో సమావేశం జరగాల్సి ఉంది. ఈలోపే జెరోమ్ పావెల్ స్థానంలో కొత్త చీఫ్ ను నియమించాలని ట్రంప్ భావిస్తున్నారు. తనకు నచ్చిన వ్యక్తిని కొత్త చైర్మన్ గా అమెరికా అధ్యక్షుడు ప్రకటించుకోవచ్చు. అయితే.. అక్కడి సెనెట్ బ్యాంకింగ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమై, సదరు వ్యక్తి పూర్వాపరాలు ఆరా తీసి ఓకే చేయాల్సి ఉంటుంది. కమిటీ సమావేశం అంతా బహిరంగంగానే జరుగుతుంది. ఈ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక.. సెనేట్ లో ఓటింగ్ పెడుతారు. అందులో సదరు వ్యక్తి నెగ్గితే.. ఫెడ్ చైర్మన్ గా గెలిచినట్లు ప్రకటిస్తారు. పదవీ కాలం నాలుగు సంవత్సరాలు ఉంటుంది. ఈ పదవిని ఒక వ్యక్తి ఎన్నిసార్లయినా చేపట్టవచ్చు. ప్రస్తుత చైర్మన్ పావెల్ కు ఇది రెండోసారి.
రేసులో ఎవరున్నారంటే..!
పావెల్ అంటేనే ఏ మాత్రం ట్రంప్ కు నచ్చడం లేదు. దీంతో ఆయనను మళ్లీ ఫెడ్ చైర్మన్ ను చేసే అవకాశం కనిపించడం లేదు. ఫెడ్ కి కొత్త చీఫ్ (New Fed Chief) రేసులో కెవిన్ వార్ష్ (Kevin Warsh) ముందు వరుసలో ఉన్నారు. ఈయన ప్రస్తుతం స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. 2002 నుంచి 2006 మధ్య కాలంలో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ దగ్గర ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. ట్రంప్ ఆలోచనలకు దగ్గరిగా ఆయన ఆర్థిక విధానాలు ఉన్నాయి. అందుకే కెవిన్ వార్ష్ వైపే అమెరికా ప్రెసిడెంట్ ఎక్కువ మొగ్గు చూపుతున్నారని, ఏ క్షణమైనా ఈఈయన పేరును ఖరారు చేయొచ్చని అమెరికా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఆ తర్వాత స్థానంలో ట్రంప్ ఆర్థిక సలహాదారు కెవిన్ హాసెట్ (Kevin Hassett), ప్రస్తుత ఫెడ్ గవర్నర్ క్రిస్టోఫర్ వాలర్ (Christopher Waller) పేర్లు వినిపిస్తున్నాయి.


