కలం, మెదక్ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) కు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిశారు. కేసీఆర్ కుటుంబసభ్యులు, హరీశ్ రావు, కేటీఆర్, సంతోష్ రావు.. ఇలా వరుసగా సిట్ విచారణకు హాజరైన తర్వాత ఈ రోజు తాజాగా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ కు సైతం నోటీసులు జారీ చేయడంతో ఏం జరగబోతుంది అనే అంశం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయంగా మారింది.
ఇప్పటి వరకు జరిగిన విచారణ తీరు, రేపు ఎలా ఎదుర్కోవాలి అనే విషయంపై కేసీఆర్, హరీశ్ రావు చర్చించినట్టు తెలుస్తుంది. కేసీఆర్ కుటుంబసభ్యులను సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడిగారు.. అలాగే ఏ రకమైన ఆధారాలతో అధికారులు ప్రశ్నలను సంధించారు.. అనే విషయాలపై కసరత్తు చేసినట్టు తెలుస్తుంది. సిట్ అధికారుల విచారణ తీరు, ప్రశ్నల సరళి, ఈ కేసులో న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా, అలాగే కొత్త సమస్యలు తలెత్తకుండా ఎలా డీల్ చేయాలనే విషయంపై సమాలోచనలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కు కేంద్ర బిందువుగా ఉన్న ప్రభాకర్ రావు, పెద్దాయన ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేసినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో, నెక్స్ట్ ఏమి జరగబోతుందనే అటెన్షన్ అందరిలోనూ ఉన్నది. కేసీఆర్ (KCR) విచారణ సందర్భంగా పెద్దాయన ప్రస్తావన వస్తే ఏం చెప్పాలి అనే దానిపై స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని నిర్ణయించారు. అంతే కాకుండా నోటీసుల నేపథ్యంలో ట్యాపింగ్ కేసును న్యాయపరంగా ఏ విధంగా డీల్ చేయాలి, రాజకీయంగా అవలంబించవలసిన కార్యాచరణపై ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. హరీశ్ రావు, కేటీఆర్ సిట్ విచారణకు వెళ్తున్న సందర్భంగా, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు వచ్చి హల్ చల్ చేశారు.
అదే తరహాలో కేసీఆర్ విచారణ సందర్భంగా కూడా భారీ జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులను పూర్తి స్థాయిలో ప్రచారం చేయకుండా విచారణ పేరుతో అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని అంచనా వేస్తున్నారు. గ్యారంటీల అమలు కాకపోవడంపై, ఇతర ప్రభుత్వ వైఫల్యాలపై రేవంత్ రెడ్డిని, ప్రభుత్వంను నిలదీస్తున్నందుకే కుట్రపూరితంగా నోటీసులు ఇస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే అంశం ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యాచరణ ఉండాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది.
Read Also: ఫోన్ ట్యాపింగ్ కేసు : సిట్ విచారణకు హాజరవడంపై కేసీఆర్ క్లారిటీ
Follow Us On: X(Twitter)


