రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ(Vemulawada)లోని రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం తెల్లవారుజామున నుంచి భక్తుల దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. ఆలయ అభివృద్ధి పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆకస్మికంగా దర్శనాలు బంద్ చేయడం ఏమిటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేకువజామునే ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఇనుప రేకులను అడ్డంపెట్టిభక్తుల ప్రవేశాన్ని పూర్తిగా ఆపేశారు. ఆలయం చుట్టూ ఉన్న ఇతర మార్గాలన్నింటికీ ఇప్పటికే ఇనుప రేకులు అమర్చి, భక్తులు లోనికి రాకుండా అడ్డుకట్ట వేశారు.
దాంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నిరాశకు గురయ్యారు. కార్తీక మాసం కావడంతో ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడకు భక్తులు తరలివచ్చారు. భక్తుల సౌలభ్యం కోసం ఆలయ అధికారులు స్వామివారి ప్రచార రథం వద్ద భారీ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. దాంతో భక్తులు అక్కడి నుంచే స్వామి దర్శనాన్ని టెలివిజన్ స్క్రీన్ ద్వారా చేసుకునే అవకాశం కల్పించారు. అయితే, “ఇంత పెద్ద ఆలయాన్ని ఇలా ఆకస్మికంగా మూసేయడం సరికాదు. కనీసం ముందు రోజు ప్రకటించి ఉంటే మేము ప్రయాణం ఆపేవాళ్లం” అని పలువురు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేములవాడలోని భీమేశ్వరాలయంలో మాత్రం భక్తుల దర్శనాలు కొనసాగుతున్నాయి. అక్కడ కోడె మొక్కలు, ఆర్జిత సేవలను సాధారణంగా కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రధాన ఆలయ ప్రాంతంలో జరుగుతున్న భారీ స్థాయి అభివృద్ధి పనుల కారణంగా పరిసర ప్రాంతాల్లో కూల్చివేతలు నెలరోజులుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆలయ దక్షిణ, ఉత్తర ప్రాకారాలు, పడమర వైపు ఉన్న నైవేద్యశాల, ఈవో కార్యాలయం వంటి నిర్మాణాలు తొలగించారు. భవిష్యత్తులో ఆలయ విస్తరణ, సౌకర్యాల మెరుగుదల కోసం ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. దేవాదాయశాఖ కమిషనర్, ఆలయ ఈవో అనుమతితోనే ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. వేములవాడ(Vemulawada)లో ఆలయ దర్శనాలు ఎప్పుడు పునఃప్రారంభమవుతాయనే విషయంపై అధికారులు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. భక్తులు మాత్రం త్వరగా పనులు ముగించి, ఆలయాన్ని మళ్లీ దర్శనార్థం తెరవాలని కోరుతున్నారు.
Read Also : ఆ వ్యాఖ్యలపై కొండా సురేఖ పశ్చాతాపం
Follow Us on: Youtube

