కలం, వెబ్ డెస్క్: ఉద్యమ నాయకుడిగా కేసీఆర్(KCR)పై గౌరవం ఉందని, కానీ, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పారదర్శకంగా జరగాలని టీపీసీసీ చీఫ్(TPCC Chief) మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) అన్నారు. ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) కేసులో సిట్ కేసీఆర్‌కు నోటీసులు పంపించిన సందర్భంగా టీపీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు నోటీసులపై తనకు సమాచారం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత హేయమైన నేరం అని, ఈ నేరంలో దోషులు ఎవరో తేలాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. నాడు పదేళ్లుగా ప్రతిపక్ష నాయకుల మీద, పారిశ్రామిక వేత్తల మీద, ఎమ్మెల్యేల మీద, సినీ ప్రముఖుల మీద ఫోన్ ట్యాపింగ్ చేశారన్న విషయంలో నిజాలు తెలియాన్నారు. అందుకోసమే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ సిట్(SIT) వేసి విచారణ జరిపిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే తాము వెళ్లి వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిపారు.
సుమారు 560 కిపైగా వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తమకు సమాచారం ఉందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఇందులో భాగంగానే కేటీఆర్, హరీశ్ రావులను విచారించారన్నారు. సిట్ పరిధిలో ఎవర్ని పిలిచినా వచ్చి తమకు తెలిసిన సమాచారం చెప్పాలని కోరారు. కేసీఆర్ నాడు సీఎంగా ఉన్నప్పుడే ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి ఇందులో కేసీఆర్ లేదా మంత్రుల ప్రమేయం తప్పకుండా ఉంటుందని మహేశ్ కుమార్ అన్నారు. లేదంటే అధికారులు అంత సాహసం చేసి ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడే అవకాశం ఉండదన్నారు. నాడు ప్రభుత్వంలో ఓ నిర్ణయం తీసుకొని ఉంటేనే, ఆ నిర్ణయం ప్రకారం పోలీసు అధికారులు చర్యలు తీసుకొని ఉండవచ్చన్నారు. సిట్ విచారణ పూర్తయితే తప్ప వాస్తవాలు బయటకు రావని, అంత వరకు తాము ఎవ్వరినీ దోషులుగా అనుకోవడం లేదని తెలిపారు. విచారణ సంపూర్ణంగా జరగాలని, ప్రజలు కోరుకుంటున్నట్లు వాస్తవాలు బయటకు రావాలని కోరారు. సిట్ విచారణలో ఎటువంటి రాజకీయ కక్ష లేదని స్పష్టం చేశారు.


