కలం, వెబ్ డెస్క్: పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చినా, తనను సస్పెండ్ చేసినా మళ్లీ పోటీ చేసి గెలుస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender) వ్యాఖ్యానించారు. గురువారం దానం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్పీకర్ నోటీసులు తనకు అందలేదని చెప్పారు. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు తన అడ్వకేట్ వివరణ ఇస్తూ లేఖ రాసినట్లు వెల్లడించారు. దీనిపై స్పీకర్ నుంచి మళ్లీ సమాధానం రాలేదన్నారు. నోటీసులలో విచారణకు తనను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఎక్కడా చెప్పలేదని తెలిపారు. తాను ఖైరతాబాద్ ఎమ్మెల్యేనే అని, బీఆర్ఎస్(BRS) పార్టీ తనను ఇంకా సస్పెండ్ చేయలేదని దానం స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై దానం స్పందిస్తూ.. ప్రజా బలమే తన బలమని, అలాంటి పరిస్థితి వస్తే మళ్లీ ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటానని వెల్లడించారు. స్పీకర్‌ను కలిసిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.


