కలం, వెబ్ డెస్క్: పాకిస్థాన్‌కు చెందిన మార్షల్ ఆర్ట్స్ వీరుడు రషీద్ నసీమ్ (Rashid Naseem) అరుదైన రికార్డు నెలకొల్పాడు. 150 వ్యక్తిగత గిన్నిస్ ప్రపంచ రికార్డులు సాధించిన తొలి పాకిస్థానీ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ ఘనతను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ అధికారికంగా ధృవీకరించింది. రషీద్ రికార్డుల ప్రస్థానం నిరంతరాయంగా కొనసాగుతోంది. 2024లో 28 రికార్డులు నెలకొల్పగా, 2025లో గిన్నిస్ సంస్థ ఏకంగా 31 రికార్డులను ఆమోదించింది. రషీద్ ప్రతిభను గుర్తించిన గిన్నిస్ సంస్థ, గతేడాది నవంబర్‌లో జరిగిన తన 70వ వార్షికోత్సవ వేడుకల్లో రషీద్, ఆయన కుమార్తె సాధించిన విజయాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది.
తాజాగా బుధవారం ఆయన తన 150వ రికార్డును నమోదు చేశారు. చేతిలో కిలో బరువు పట్టుకుని, కేవలం ఒక నిమిషంలో 340 పంచులు (full-extension punches) విసిరి అందరినీ ఆశ్చర్యపరిచారు. వీటితో పాటు ఎగ్-వాల్నట్, నంచాకు విభాగాల్లోనూ అరుదైన రికార్డులు సృష్టించారు. ఈ వివరాలన్నీ గిన్నిస్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
మార్షల్ ఆర్ట్స్, బ్రేకింగ్, నీ స్ట్రైక్స్, స్టిక్, నంచాకు, స్కిప్పింగ్, జంపింగ్ జాక్స్ వంటి అనేక విభాగాల్లో రషీద్‌కు (Rashid Naseem) మంచి పట్టు ఉంది. తన కెరీర్లో భారత్‌పై 40 సార్లకు పైగా విజయం సాధించడమే కాకుండా.. చైనా, అమెరికా, ఇంగ్లాండ్, ఇరాన్, స్విట్జర్లాండ్ దేశాల రికార్డులను సైతం తిరగరాశారు. రషీద్ తన 150వ రికార్డును పాలస్తీనాకు అంకితం చేశారు. అయితే, అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ఇంతటి గుర్తింపు తెచ్చినప్పటికీ, ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి ప్రోత్సాహం లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: ఓడినా ధైర్యంగా ముందుకెళ్తాం : ఆర్సెనల్
Follow Us On: Instagram


