epaper
Wednesday, January 28, 2026
spot_img
epaper

‘42% రిజర్వేషన్’ పాలసీ ఉత్తదేనా?

కలం, తెలంగాణ బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ (BC Reservations) కల్పిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఉత్తదేనా?.. లీగల్ కారణాలంటూ తప్పించుకుంటున్నదా?.. జనరల్ స్థానాల్లో బీసీలకు అవకాశం ఇస్తామని మభ్యపెడుతున్నదా?.. ఇవీ ఇప్పుడు కాంగ్రెస్ చిత్తశుద్ధి పట్ల బీసీ సంఘాల్లోనూ, పార్టీలోని బీసీ ఆశావహుల్లోనూ జరుగుతున్న చర్చ. పంచాయతీ ఎన్నికల్లో ఆ హామీకి కట్టుబడకుండా కాంగ్రెస్ చేతులెత్తేసింది. పట్టణ స్థానిక సంస్థల షెడ్యూలు రానే వచ్చింది. మరో రెండు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తికానున్నది. ఇప్పుడూ జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థుల్ని నిలబెట్టడంపై క్లారిటీ ఇవ్వలేదు. డెడికేటెడ్ కమిషన్ సిఫారసు మేరకు పురపాలక శాఖ రిజర్వేషన్ ఫార్ములాను ప్రకటించింది. లీగల్ చిక్కుల కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50% దాటకుండా ఖరారు చేసింది. కాంగ్రెస్ హామీని ఆచరణలో పెట్టి కాంగ్రెస్ తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

30% దాటని బీసీ రిజర్వేషన్ :

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో బీసీ రిజర్వేషన్ 30% దాటలేదు. వీటి పరిధిలోని మొత్తం 2,996 వార్డుల్లో బీసీ జనరల్ 463, బీసీ మహిళ 391 చొప్పున కేటాయించినట్లు స్టేట్ ఎలక్షన్ కమిషన్ డాక్యుమెంట్ స్పష్టం చేసింది. అంటే వార్డుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే ఇది 28.5% మాత్రమే. ఎస్సీలకు 14.82%, ఎస్టీలకు 6.24% చొప్పున ఖరారైంది. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా 42% రిజర్వేషన్‌ స్థానంలో కేవలం 28.5% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ వర్తించనున్నది. జనరల్ స్థానాల్లో బీసీలకు అవకాశాలు ఇచ్చి హామీని నిలబెట్టుకుంటామని కాంగ్రెస్ నేతలు గతంలో పలు సందర్భాల్లో పేర్కొన్నారు. కానీ మరో రెండు రోజుల్లో నామినేషన్ల పర్వం ముగియనున్నా పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి ఇప్పటివరకు అలాంటి హామీ లభించలేదు.

రాహుల్‌గాంధీ హామీ బేఖాతర్ :

‘జితనా ఆబాదీ.. ఉతనా హక్’ అంటూ బీసీలు ఎంత ఉంటే వారికంత రిజర్వేషన్ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొదట్లో ససేమిరా అని చెప్పినా ఆ తర్వాత క్యాబినెట్ సమావేశంలో మాత్రం కులగణన కూడా చేపట్టనున్నట్లు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. బీసీ రిజర్వేషన్ డిమాండ్‌ను తెరపైకి తెచ్చిన కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో దాన్ని అటకెక్కిస్తున్నది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో ప్రకటించిన డిక్లరేషన్‌లో సైతం 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చినా అమలుకు ఆమడదూరంలోనే ఉండిపోయింది. దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ గురించి గంభీర ఉపన్యాసాలు ఇచ్చినా అధికారంలో ఉన్న తెలంగాణలోనే ఈ ఫార్ములాను పార్టీ అమలు చేయలేకపోతున్నది.

జనరల్ స్థానాల్లో బీసీలకు అవకాశమిస్తుందా? :

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 116 మున్సిపాలిటీల్లో 38 మాత్రమే బీసీలకు దక్కాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ పోస్టులరీత్యా చూస్తే ఇది 32.75%. ఉదాహరణకు నల్లగొండ జిల్లాలో మొత్తం 17 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఆలేరు, దేవరకొండ మున్సిపాలిటీలు బీసీ మహిళలకు రిజర్వుకాగా, హుజూర్‌నగర్ బీసీ జనరల్‌కు ఖరారైంది. మిగిలిన 14లో నందికొండ ఎస్సీ జనరల్, మోతుకూరు ఎస్సీ మహిళకు రిజర్వు అయ్యాయి. మొత్తం 17 మున్సిపాలిటీల్లో ఐదు ఎస్సీ, బీసీలకు రిజర్వు కాగా మిగిలిన 12 జనరల్ కేటగిరీ కింద ఉన్నాయి. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు 42% రిజర్వేషన్ అమలైతే 17 మున్సిపాలిటీల్లో బీసీలకు ఏడు దక్కేవి. ప్రస్తుతం మూడే ఉండడంతో మిగిలిన నాలుగు జనరల్ కోటా కింద బీసీ అభ్యర్థులకు అవకాశమిచ్చి 42% రిజర్వేషన్ హామీని నిలబెట్టుకుంటుందా అనేది కీలకంగా మారింది. అన్ని జిల్లాల్లోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొన్నది.

Read Also : మూడే రోజులు.. అభ్యర్థుల ఖరారు ఎలా?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>