epaper
Wednesday, January 28, 2026
spot_img
epaper

రిజిస్ట్రేషన్‌శాఖలో మరిన్ని కీలక సవరణలు: పొంగులేటి

కలం, మెదక్ బ్యూరో: రిజిస్ట్రేషన్‌శాఖలో మరిన్ని కీలక సవరణలు తీసుకురాబోతున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) పేర్కొన్నారు. ప్రతి మనిషికి ఆధార్ ఉన్నట్టే రానున్న రోజుల్లో భూమికి సంబంధించిన సమగ్రసమాచారంతో భూధార్ కార్డును తీసుకురాబోతున్నామన్నారు. భూధార్ కార్డు పూర్తయ్యాక పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయని తెలిపారు. భూభారతి కార్యక్రమం ద్వారా ఎక్కడ రిజిస్ట్రేషన్ జరిగినా ఒకే ప్లాట్‌ఫారంలో భూమి వివరాలు, సరిహద్దులు, నిషేధిత సర్వే నెంబర్ల వివరాలు లభించే విధంగా వ్యవస్థను రూపొందిస్తున్నట్లు చెప్పారు. కొత్తగా తీసుకొచ్చే యాప్ ద్వారా డబుల్, ట్రిపుల్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూములు అక్రమ రిజిస్ట్రేషన్లను జరుగకుండా ఉంటాయని స్పష్టం చేశారు. అధునాతన టెక్నాలజీతో భూములు సర్వే చేపడుతున్నామని అందుకు 5,500 మంది లైసెన్స్ కలిగిన సర్వేయర్లను నియమించామని, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సర్వేలు నిర్వహించేందుకు ఆధునిక పరికరాలు కొనుగోలు చేశామని చెప్పారు. భూ సమస్యలు తగ్గితే రాష్ట్రానికి మరింతగా పెట్టుబడులు వస్తాయని మంత్రి తెలిపారు. సంగారెడ్డి జిల్లా కర్దనూర్‌లో ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాంప్లెక్స్‌కు సహచర మంత్రి వివేక్ తో కలిసి మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు.

పారదర్శకంగా రిజిస్ట్రేషన్‌శాఖ

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను పూర్తిగా పారదర్శకంగా, అవినీతి రహితంగా ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు అమలు చేస్తోందని పొంగులేటి (Ponguleti Srinivasa Reddy) తెలిపారు. ప్రజలకు సౌకర్యవంతంగా, అత్యాధునిక సదుపాయాలతో, కార్పొరేట్ స్థాయి ప్రమాణాలతో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా నిర్మిస్తున్నామన్నారు. మొదటి విడతగా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోపల ఉన్న 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఇంటిగ్రేటెడ్ కార్యాలయములో 11 క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తున్నట్లు నిర్ణయించామని తెలిపారు. అందులో భాగంగా పటాన్ చెరువు లో ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశామన్నారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వల్ల ప్రజలకు అనేక భూ సమస్యలు వచ్చాయని, దాని కారణంగా ప్రజలు ఆందోళనలు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం ద్వారా ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీజీఐఐసీ చైర్పెర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి,రిజిస్ట్రేషన్లు & స్టాంప్స్ శాఖ కమిషనర్ రాజీవగాంధీ హనుమంతు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>