కలం, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో మహామహులు, ఉద్ధండులకైనా ఎప్పుడో ఒకసారి ఓటమి తప్పదు. అయితే, అత్యంత అరుదుగా కొందరు నాయకులు మాత్రం విజయాన్నే తమ ఇంటి చిరునామాగా మార్చుకుంటారు. అలాంటి కోవకు చెందిన నాయకుడే అజిత్ పవార్ (Ajit Dada). కార్యకర్తలు, అభిమానులందరూ ముద్దుగా ‘అజిత్ దాదా’ అని పిలుచుకునే అజిత్ అనంతరావ్ పవార్.. రాజకీయ జీవితంలో ఓటమి ఎరుగని నాయకునిగా నిలిచారు. ఒక దఫా లోక్‌సభకు, ఎనిమిది సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.ఈ క్రమంలో నాలుగు సార్లు మంత్రిగా, ఆరుసార్లు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి బాధ్యతల్లో ఉండగానే, ఈ ఉదయం జిల్లా స్థానిక ఎన్నికల ప్రచారానికి వెళుతూ బారామతి వద్ద జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ నేపథ్యం, రాజకీయాల్లో రాణించిన తీరు ఏంటంటే..
తాత వారసత్వం..
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా రాహూరి తాలూకా దేవ్లాలి ప్రవరలో 1959 జులై 22న అజిత్ పవార్ (Ajit Dada) పుట్టారు. తల్లిదండ్రులు అనంతరావ్ గోవిందరావ్ పవార్, ఆశా తాయ్ పవార్. అజిత్ తాత గోవిందరావ్ పవార్, తన భార్య శారద పవార్‌తో కలసి స్థానిక రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. వీళ్లకు ఏడుగురు కుమారులు, ఐదుగురు కూతుళ్లు. ఇందులో అజిత్ పవార్ చిన్నాన్న శరద్ పవార్ ఒకరు. ఈయన మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్ధండులు. ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ ప్రకారం అజిత్ పవార్ కుటుంబానికి మూడు తరాలుగా చాలా బలమైన రాజకీయ నేపథ్యం ఉంది.
అజిత్‌కు ఒక అన్న శ్రీనివాస్, సోదరి విజయ ఉన్నారు. అజిత్‌కు సునేత్రతో పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు జై, పార్థ్ ఉన్నారు.
జనతా దర్బార్లు..
18 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన అజిత్ కుటుంబ బాధ్యతలు మోస్తూనే.. బాబాయ్ అండతో 22 ఏళ్లకు రాజకీయాల్లో అడుగుపెట్టారు. చాలా తక్కువ కాలంలోనే ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు. వివిధ సహకార సంఘాలు, మిల్క్ యూనియన్లు, చక్కెర ఫ్యాక్టరీలు, కోఆపరేటివ్ బ్యాంకుల్లో పదవులు నిర్వహించారు. బారామతి నుంచి ఒకసారి ఎంపీగా, ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి, ఉపముఖ్యమంత్రి అయ్యారు.
పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేవారు. దీనికోసం ఆయన ఎంచుకున్న మార్గం జనతాదర్బార్. ప్రతి రోజూ కనీసం 16 నుంచి 17 గంటల పాటు ప్రజల కోసమే కేటాయించేవారు. కార్యకర్తలు, ప్రజలను సమానంగా గౌరవించేవారు.ఏదైనా పని సాధ్యమవుతుందని అనిపిస్తే ‘ఎస్’ చెప్పేవారు. లేదంటే నిర్మొహమాటంగా ‘నో’ చెప్పేవారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడం, సమస్యలను పరిష్కరించడం, అభివృద్ధి కోసం వివిధ రంగాల్లో నిపుణులు, అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం అజిత్‌ను మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకంగా నిలబెట్టాయి.
Read Also: రిజిస్ట్రేషన్‌శాఖలో మరిన్ని కీలక సవరణలు: పొంగులేటి
Follow Us On: Pinterest


