కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజల తరఫున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు హనుమకొండ చౌరస్తాలో బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (MLA Naini) సవాల్ విసిరారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిధులు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన నిధులపై ప్రజల ముందే చర్చిద్దామన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
అభివృద్ధి చేయకపోవడమే కాకుండా, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను అడుగడుగునా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న కల్పత సూపర్ బజార్ సహా పలు విభాగాల్లో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే నాయిని వెల్లడించారు. కల్పత సూపర్ మార్కెట్ ద్వారా నెలకు సుమారు రూ.1.20 లక్షల ఆదాయం వస్తుండగా, 24 నెలల్లో సుమారు రూ.28.80 లక్షల నిధులను పని చేయని వారిని చూపించి, బినామీ పేర్లతో దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
వినయ్ భాస్కర్ అభివృద్ధి నిరోధకుడిగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే నాయిని (MLA Naini) విమర్శించారు. నిన్ను ఓడించేందుకు నీ కుటుంబ సభ్యులే సొంత ఖర్చుతో ప్రచారం చేసిన విషయం ప్రజలు మర్చిపోలేదన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఒక్కరోజైనా జిల్లా లేదా నియోజకవర్గ అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చించావా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలపై మాట్లాడకుండా క్యాంపు కార్యాలయంలో ఫర్నీచర్ లేవని మాట్లాడిన వ్యక్తి అభివృద్ధి గురించి మాట్లాడటం సిగ్గుచేటని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే అధికారులు కూల్చివేస్తుంటే, దళితుడని అన్యాయం జరుగుతోందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 26 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ఆయన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు డిపాజిట్లు కాపాడుకోవడానికే పరిమితమయ్యాయని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాస్ రావు, ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
Read Also: మంత్రుల ప్రోగ్రాంను బాయ్ కాట్ చేసిన స్థానిక ఎమ్మెల్యే
Follow Us On: Youtube


