epaper
Wednesday, January 28, 2026
spot_img
epaper

నిజామాబాద్‌పై మూడు పార్టీల స్పెషల్ ఫోకస్..!

కలం, నిజామాబాద్ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో(Municipal Elections) రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిజామాబాద్‌(Nizamabad )పై అన్ని పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిజామాబాద్‌పై రెండు నెల‌ల‌ క్రితమే ఫోకస్ పెట్టారు. సోషల్ ఇంజినీరింగ్‌లో భాగంగా అప్పటి వరకూ సైలెంట్‌గా ఉంటున్న డి.శ్రీనివాస్ కొడుకు మాజీ మేయర్ సంజయ్‌ని సీఎం రేవంత్ ఆక్టివేట్ చేశారు. అంతకుముందు ఇచ్చిన హామీ మేరకు ఆయనకు కార్పొరేషన్ పదవి కట్టబెట్టే అవకాశం కనిపిస్తోంది. మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికైన సంజయ్‌ సీఎం రేవంత్ దిశా నిర్దేశంతో పాలిటిక్స్ లో మళ్లీ బిజీ అయ్యారు.

సంజయ్‌కి నిజామాబాద్‌(Nizamabad )లో బలంగా ఉన్న మొదటి రెండు వర్గాలు ముస్లిం, మున్నూరు కాపుల‌లో పట్టు ఉంది. ఈ రెండు వర్గాలు నిజామాబాద్ రాజకీయ ముఖ చిత్రాన్ని శాసించే స్థాయిలో ఉన్నాయి. ఈ మేరకు సంజయ్ ప్రాబల్యం కూడా పార్టీ విజయానికి దోహదం అవుతుంద‌ని సీఎం రేవంత్ ఆలోచన. ఇక రాష్ట్రస్థాయి వ్యూహాలు చూస్తే.. ఇన్ ఛార్జ్ మంత్రిగా ఉన్న సీతక్కను మరో జిల్లాకు పంపించిన రేవంత్ నిజామాబాద్ బాధ్య‌త‌ల‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించారు. ఆయన ఇప్పటికే నిజామాబాద్‌కు వచ్చి నాయకులు కార్యకర్తల సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి అంతర్గత సమావేశంలోనూ స్వీట్ వార్నింగ్‌లు ఇస్తూనే పార్టీ గెలుపు లక్ష్యాలను సీరియ‌స్‌గా చెప్పి వెళ్లారు. పార్లమెంట్ మొత్తం మున్సిపాలిటీల్లో క్లీన్ స్వీప్ చేయాల్సిందే అని టార్గెట్ ఫిక్స్ చేశారు.

ఇక మరో ప్రధానమైన అంశం నిజామాబాద్‌ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇలాకా. ఆయన సైతం నిజామాబాద్ నగరపాలక సంస్థ పై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో ఉన్నారు. బీజేపీతో ఇప్పటికే ఢీ అంటే ఢీ అన్నట్టు కౌంటర్ ఎటాక్‌లు చేస్తున్నారు. అన్ని డివిజన్‌ల‌లో అభివృద్ధి నిధులు మంజూరు చేసి శంకుస్థాపనలు, పనుల ప్రారంభోత్సవాలతో మంత్రుల పర్యటనలతో హడావుడి చేస్తోంది హస్తం పార్టీ. ఓవైపు అభివృద్ధి, మరోవైపు ఎంఐఎం దోస్తానా కాంగ్రెస్‌కు కలిసివచ్చే ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు.

మేయర్ సీటు టార్గెట్‌గా బీజేపీ వ్యూహాలు

నిజామాబాద్‌లో గతంలో అతి పెద్ద పార్టీ బీజేపీయే అంటే నమ్మశక్యం కాదు. నగరపాలక సంస్థలో 60 డివిజన్‌లు ఉంటే.. అత్యధికంగా 28 స్థానాల్లో గెలుపొందింది. హిందుత్వ వాదంతో పాటు ఎంపీ అరవింద్ వ్యూహాలు గ్రౌండ్ వర్క్ ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. అయినా అప్పుడు మేయర్ సీటును బీఆర్ఎస్ కారులో వేసుకొని వెళ్లిపోయింది. 16 గెలిచిన ఎంఐఎం సహకారంతో 12 మాత్రమే గెలిచిన బీఆర్ఎస్ పావులు కదిపి మేయర్ స్థానాన్ని సొంతం చేసుకుంది. డిప్యూటీ మేయర్ పోస్టును ఎంఐఎంకు కేటాయించారు. గతంలో కాంగ్రెస్(Congress) పార్టీ నుంచి ఇద్దరు మాత్రమే గెలిచారు. ఈసారి బీజేపీ మరింత పటిష్టంగా గ్రౌండ్ వర్క్ చేస్తోంది. సిట్టింగ్ కార్పొరేటర్లకు సైతం కొందరికి టికెట్‌లు ఇవ్వద్దని నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

మన నిజామాబాద్.. మన ఇందూరు… మన మేయర్.. అనే నినాదం జనాల్లోకి తీసుకెళ్తుంది. ఈ మేరకు నగరం అంతటా గోడలపై రాతలు వెలిశాయి. కొన్ని షాపుల పైన ఉన్న పేర్లు నిజామాబాద్ అని తీసేసి ఇందూరు అని మార్చారు. ఇందూరుగా మార్చాలంటే మేయర్ బీజేపీ(BJP) అయి ఉండాలని ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ అంటున్నారు. దాంతో పాటు నిజామాబాద్‌లో ఇప్పటికే రెండు ఆర్యూబీల నిర్మాణానికి నిధులు తీసుకొచ్చారు. పనులు కొనసాగుతున్నాయి. అవి ట్రాఫిక్ పరంగా కనెక్టివిటీ పరంగా కీలక మైన దశాబ్దాల పెండింగ్ ప్రాజెక్టులు. అరవింద్ కృషితో ముందడుగు పడింది. నిజామాబాద్‌కు బీజేపీ ఎంపీ కార్పొరేషన్ ఉన్న నిజామాబాద్ నగరానికి బీజేపీ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా ఉండటం కేంద్ర పథకాలు పనులు కమలం పార్టీ బలాలు. కానీ ఎంఐఎం ఈసారి మళ్లీ కీలకంగా మారనున్న నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ దాట‌డం అనేది ఇప్పుడు బీజేపీ ముందున్న లక్ష్యం.

గులాబీ హయాంలోని అభివృద్ధితో ముందుకు “కారు”

గులాబీ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోవడం ఆ పార్టీకి నిజామాబాద్‌లో (Nizamabad) మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు 90 శాతం పూర్తి, డివైడర్లు సుందరీకరణ పార్క్ లు మినీ ట్యాంక్ బండ్ ఇలా అనేక పనులు చేసింది బీఆర్ఎస్(BRS). ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లు పూర్తయినా ప్రారంభం కాలేదు. కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అంటున్నారు. 60 డివిజన్‌లకు రూ.100 కోట్లు మేమే తెచ్చామని అవి కాంగ్రెస్‌, బీజేపీలు తీసుకొచ్చినట్టుగా హడావుడి చేస్తున్నాయని విమర్శించారు. ఇలా తమ హయాంలో జరిగిన అభివృద్ధి ప్రభుత్వ వైఫల్యం ఎజెండాగా కారు ముందుకెళ్తోంది. అభివృద్ధి మళ్లీ కావాలంటే బీఆర్ఎస్ గెలవాలని ప్రచారం చేస్తోంది. ఇలా నిజామాబాద్‌లో ఎక్కడా లేని విధంగా బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ల మ‌ధ్య‌ త్రిముఖ పోటీ కనిపిస్తోంది.

Read Also: అన్ని పార్టీల నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయి : దానం నాగేందర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>