epaper
Wednesday, January 28, 2026
spot_img
epaper

ఇటు జాతర.. ఆపై వరల్డ్ కప్.. మున్సి‘పోల్స్’ జోష్ లేనట్టే!

కలం, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ప్రచారం (Municipal Elections) ఈసారి చప్పగా సాగే అవకాశం కనిపిస్తున్నది. ఒకవైపు జాతరలు.. ఆపై క్రికెట్ వరల్డ్ కప్ ఉండటంతో జనం, ముఖ్యంగా యువత ప్రచారంలో అంతగా పాల్గొనకపోవచ్చని లీడర్లు అంచనా వేసుకుంటున్నారు. దీంతో ఎలా ముందుకు వెళ్లాలని తర్జనభర్జన పడుతున్నారు. పైగా ఒక దాని తర్వాత ఒకటి ఈవెంట్లు కూడా ఉండటంతో.. ఈవెంట్లు లేని టైమ్ లోనే ఎక్కువ మంది ఓటర్లను కలవాలని క్యాలెండర్ ను తిరగేస్తున్నారు. ఏయే ఈవెంట్లు ఎప్పుడున్నాయని ఆరా తీస్తున్నారు. 116 మున్సిపాలిటీలకు, 7 కార్పొరేషన్లకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. బుధవారం నోటిఫికేషన్, దాంతోపాటే నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఫిబ్రవరి 3న విత్ డ్రాలతో ఎవరు బరిలో ఉంటారనేది తేలిపోతుంది. అంటే ఫిబ్రవరి 4 నుంచి ప్రచారం స్టార్ట్ అవుతుంది. పోలీంగ్ ఫిబ్రవరి 11న ఉండటంతో 9వ తేదీ సాయంత్రం వరకే ప్రచారం ముగించాల్సి ఉంటుంది. అంటే విత్ డ్రాల తర్వాత ప్రచారానికి మిగిలేది ఆరు రోజులే. ఈ ఆరు రోజుల్లో, అంతకు ముందు.. ఎలాంటి ఈవెంట్లు లేని టైమ్ ను చూసుకొని జనంలోకి వెళ్లాలని లీడర్లు ప్లాన్ చేసుకుంటున్నారు.

4 రోజులు జాతర.. 1న బడ్జెట్

రాష్ట్రంలో ముఖ్యమైన జాతర మేడారం (Medaram Jatara). రెండేండ్లకోసారి జరిగే ఈ మహా కుంభమేళాకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి జనం భారీగా తరలివస్తుంటారు. ఈ నెల 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు మేడారం జాతర కొనసాగుతుంది. ఇటు జనం కానీ, అటు మీడియా కవరేజీ కానీ మొత్తం మేడారం చుట్టే ఉంటుంది. ఈ సమయంలో ఓట్ల కోసం గల్లీల్లోకి వెళ్లినా లాభం ఉండదని లీడర్లు అనుకుంటున్నారు. అందుకే జాతర ముగిసిన తర్వాత ప్రచారం మొదలు పెట్టాలని భావిస్తున్నారు. అయితే.. జాతర ముగిసిన మరుసటిరోజు ఆదివారం (ఫిబ్రవరి 1న) కేంద్ర బడ్జెట్ (Union Budget). ఆ రోజు జాతీయ స్థాయిలో దీనిపైనే డిస్కషన్స్ ఉంటాయి. రాష్ట్రానికి కేంద్రం ఏం కేటాయించిందని, ఎన్ని నిధులు వస్తాయని లీడర్లు.. తమకు ఏం బెనిఫిట్ ఉంటుందని ఆ రోజు జనం లెక్కలు వేసుకుంటారు. దీంతో ఫిబ్రవరి 1 కూడా ప్రచారం చేయడానికి కుదరదని మున్సి‘పోల్స్’ (Municipal Elections) ఆశావహులు భావిస్తున్నారు. అంటే.. ఫిబ్రవరి 2 సోమవారం ఎలాంటి ఈవెంట్ లేదని, ఆరోజు ప్రచారం చేసుకోవచ్చని అనుకుంటున్నారు.

2 నుంచే వరల్డ్ కప్ జోష్ షురూ

టీ 20 క్రికెట్ అంటే ఇప్పుడు అదో క్రేజీ! సిరీస్ లనే టీవీలకు, మొబైల్స్ కు హత్తకుపోయి యువత చూస్తున్నారు. ఇప్పుడు ఫిబ్రవరి టీ20 వరల్డ్ కప్ (T20World Cup) జరగనుంది. అదీ ఇండియా, శ్రీలంక వేదికగా ప్రపంచ క్రికెట్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే యూత్ దానిపైనే చర్చించుకుంటున్నారు. వాస్తవ మ్యాచ్ లు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు వరల్డ్ కప్ మ్యాచ్ లు ఉన్నాయి. ఫిబ్రవరి 7 కంటే నాలుగు రోజుల ముందే అంటే ఫిబ్రవరి 2 నుంచి వామప్ మ్యాచ్ లు ఉన్నాయి. 2 నుంచి 6 వరకే యూత్ తమ వెంట ఉంటారని.. ఆ తర్వాత పిలిచినా రారని, వరల్డ్ కప్ బిజీలో పడి టీవీలకు, సెల్ ఫోన్లకే అత్తుకుపోతారని మున్సిపోల్స్ అభ్యర్థులు భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో పకడ్బందీగా ప్రచారానికి ప్లాన్ చేసుకుంటేనే గట్టునపడ్తామని అనుకుంటున్నారు.

Read Also: ఇండియా ఈయూ డీల్ : మన పరిశ్రమలకు భారీ బూస్ట్

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>