కలం, వెబ్డెస్క్: ఆప్ఘనిస్థాన్ (Afghanistan) లో తాలిబన్ ప్రభుత్వం మరో వివాదాస్పద చట్టం తీసుకొచ్చింది. ఇప్పటికే మహిళలు, బాలికలకు చదువు, కొన్ని రంగాల్లో పని, బయటి వ్యక్తులతో మాట్లాడడంపై నిషేధం వంటి అనేక చట్టాలను తాలిబాన్లు రూపొందించిన సంగతి తెలిసిందే. దీనిని మించిపోయే రీతిలో మరో కొత్త చట్టాన్ని మంగళవారం ప్రవేశపెట్టారు. ‘క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆఫ్ కోర్ట్’ పేరుతో తయారుచేసిన ఈ కొత్త చట్టంపై మానవహక్కుల సంస్థలు మండిపడుతున్నాయి. అంతర్జాతీయ పరిశీలకులు, ప్రవాసంలో ఉన్న ఆఫ్ఘన్ మేధావులు, రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త చట్టంలో ఏముందంటే..
ఇది దేశంలోని ప్రజలను నాలుగు రకాలుగా విభజించింది. ఉలేమా/ముల్లా(మత ప్రబోధకులు), ఉన్నతవర్గాలు (అష్రఫ్ లేదా ప్రభువులు), మధ్య తరగతి, దిగువ తరగతి అనే నాలుగు రకాలుగా పేర్కొంది. ఏదైనా నేరం(అది ఏ స్థాయిదైనా సరే) చేశారని తేలితే ముల్లాలకు కేవలం సలహా మాత్రమే ఇస్తారు. వాళ్ల మీద కేసులు ఉండవు. ఉన్నతవర్గాలకు సమన్లు, సలహా ఇస్తారు. శిక్ష ఉండదు. ఇక మధ్య తరగతివాళ్లను జైలుకు పంపిస్తారు. దిగువ తరగతివాళ్లకు జైలుతోపాటు కఠిన శిక్షలు అమలుచేస్తారు. ఇలా ప్రజల్ని నాలుగు రకాలుగా విభజించడం, ముల్లాలకు నేరాల నుంచి రక్షణ కల్పించడంపై మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు, ఈ చట్టం గులాం (బానిసత్వం) కాలాన్ని.. భారత్లో ఒకప్పుడు ఉన్న వర్ణ వ్యవస్థను తలపిస్తోందంటూ మండిపడుతున్నారు. ఏళ్లపాటు అంతర్యుద్ధంతో నష్టపోయిన దేశాన్ని(Afghanistan) అభివృద్ధి పథంలో తీసుకెళ్లడం మరచి, ఇప్పటికే షరియా చట్టాన్ని తాలిబాన్లు (Talibans) అమలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త చట్టంపై ఐక్యరాజ్య సమితి, అమెరికా, విదేశాలు జోక్యం చేసుకోవాలని, దీన్ని రద్దు చేసేలా చూడాలని వాళ్లు కోరుతున్నారు.
Read Also: పాకిస్థాన్లో తిరిగి తెరుచుకున్న లవుని ఆలయం
Follow Us On : WhatsApp


