కలం, వెబ్ డెస్క్ : గుత్తా అమిత్ రెడ్డి (Gutha Amith Reddy)కి టీపీసీసీ కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) వార్‌రూమ్ చైర్మన్‌గా గుత్తా అమిత్ రెడ్డిని తక్షణమే అమలులోకి వచ్చే విధంగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో జరగబోయే పురపాలక సంఘాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. అమిత్ రెడ్డి నాయకత్వంలో వార్ రూమ్ మరింత సమర్థవంతంగా పనిచేస్తూ ఎన్నికల వ్యూహాలను పకడ్బందీగా అమలు చేయనుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ఈ ఎన్నికల్లో అన్ని కార్పొరేషన్ పదవులు, మున్సిపాలిటీలను గెలుచుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగానే యువనేత అమిత్ రెడ్డికి ఈ పదవి ఇచ్చినట్టు సమాచారం. అమిత్ రెడ్డి (Gutha Amith Reddy) ఎంతో యాక్టివ్ గా ఉంటారని.. వార్ రూమ్ కార్యకలాపాలను సమర్థంగా నిర్వహిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఓబీసీ విభాగానికి నూతన నియామకాలు..
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)కి చెందిన ఓబీసీ విభాగానికి నూతన నియామకాలు చేపట్టారు. టీపీసీసీ ఓబీసీ విభాగం చైర్మన్‌గా కె. శంకరయ్యను నియమించేందుకు కాంగ్రెస్ అధ్యక్షులు ఆమోదం తెలిపారు.
అలాగే, ఓబీసీ విభాగం కన్వీనర్లుగా డా. కేతూరి వెంకటేశ్, డా. జులూరు ధనలక్ష్మిలను నియమించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) జనరల్ సెక్రటరీ కె.సి. వేణుగోపాల్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో ఓబీసీ వర్గాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.


