epaper
Tuesday, January 27, 2026
spot_img
epaper

నా మూలాలు భారత్​లో : ఆంటోనియో కోస్టా

కలం, వెబ్​డెస్క్​: భారత్​, ఈయూ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి సంయుక్త ప్రకటన వెల్లడించే సమయంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ ఒప్పందం గురించి మాట్లాడుతూ యూరోపియన్​ కౌన్సిల్​ ప్రెసిడెంట్​ ఆంటోనియా కోస్టా (Antonio Costa) ఓ కార్డు తీసి చూపించారు. అది విదేశాల్లో నివసించే భారత పౌరులకు ఇండియా ఇచ్చే ఓసీఐ కార్డు. అది చూసి ప్రధాని నరేంద్ర మోదీ, యూరోపియన్​ యూనియన్​ ప్రెసిడెంట్​ ఉర్సులా వాన్​డర్​ లేయెన్​ చిరునవ్వులు చిందించగా, మిగిలినవాళ్లు ఆశ్చర్యపోయారు. అదే సమయంలో ఆ కార్డు వెనక ఉన్న అసలు సంగతిని కోస్టా వెల్లడించారు. తన మూలాలు భారత్​లో ఉన్నాయని సగర్వంగా ప్రకటించారు.

‘నేను యూరోపియన్​ కౌన్సిల్​ ప్రెసిడెంట్​ని. అంతేకాదు, ప్రవాస భారతీయుడిని’ అని భావోద్వేగంతో చెబుతూ, కోస్టా తన జేబులోంచి ఓసీఐ కార్డు తీసి చూపించారు. ‘ఇది నాకెంతో ప్రత్యేకం. నా మూలాలు భారత్​లోని గోవాలో ఉన్నాయని చెప్పేందుకు గర్వంగా భావిస్తున్నా. ఇక్కడి నుంచే మా కుటుంబం యూరప్​తో సంబంధం కలిగి ఉంది. ఇది వ్యక్తిగతంగా నాకు ఎంతో ప్రత్యేకం’ అని కోస్టా అన్నారు.

గోవాలో ఇప్పటికీ ఇల్లు..

భారత్​లోని గోవా ఒకప్పుడు పోర్చుగీసు కాలనీగా ఉండేది. ఆ సమయంలో ఆంటోనియో కోస్టా తాత గోవాలోని మార్గోవాలో పుట్టారు. అక్కడే తన జీవిత కాలంలో ఎక్కువ భాగం గడిపారు. అతని కుమారుడే ఓర్లాండో కోస్టా. ఈయన ప్రసిద్ధ రచయిత. ఆయన రచనల్లో ఎక్కువగా భారతీయ సంగతులు కనిపించేవి. గోవా భారత్​లో కలవడంతో, 18 ఏళ్ల వయసులో ఓర్లాండో తన స్వదేశమైన పోర్చుగల్​ రాజధాని లిస్బన్​కు వెళ్లారు. అక్కడ పెళ్లి అనంతరం ఆయనకు ఆంటోనియో కోస్టా పుట్టారు. ఈ విషయాలను కోస్టా గుర్తుచేసుకున్నారు. కొంకణ్​ ప్రాంతంలో భాగమైన గోవాలో చిన్నపిల్లలను పిలిచే ‘బబుష్’ పదంతో చిన్నప్పుడు తనను తల్లిదండ్రులు పిలిచేవాళ్లని చెప్పారు.

ఆంటోనియో కోస్టా పూర్వీకులు నివసించిన 200 ఏళ్ల నాటి పురాతన ఇల్లు ఇప్పటికీ మార్గోవాలోని అబేడ్​ ఫరియా రోడ్​లో ఉంది. పోర్చుగల్​ ప్రధాని హోదాలో 2017లో ఒకసారి గోవాకు వచ్చిన ఆంటోనియో కోస్టా తన పూర్వీకుల ఇంటిని సందర్శించారు.

64 ఏళ్ల ఆంటోనియో కోస్టా (Antonio Costa) ​మృదు స్వభావి. మహాత్మా గాంధీ ఆదర్శాలకు ప్రభావితమైన వ్యక్తి. అందుకే ఆయన్ని స్వదేశంలో ‘గాంధీ ఆఫ్​ లిస్బన్​’ అని పిలుస్తారు. రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం 2014 నుంచి 2019 వరకు పోర్చుగల్​ ప్రధానిగా పనిచేశారు. అనంతరం యూరోపియన్​ కౌన్సిల్​ ప్రెసిడెంట్​ అయ్యారు. ప్రస్తుతం బెల్జియం రాజధాని బ్రస్పెల్స్​లోని యూరోపియన్​ కౌన్సిల్​ ప్రధాన కార్యాలయం నుంచి కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారు.

Read Also: యాసిడ్ దాడి నిందితుల ఆస్తుల జప్తు.. బాధితులకు పరిహారం: సుప్రీంకోర్టు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>