epaper
Tuesday, January 27, 2026
spot_img
epaper

ప్రొఫెషనల్ క్రికెట్‌కు కేన్ రిచర్డ్‌సన్ వీడ్కోలు

కలం, స్పోర్ట్స్​​ : ఆస్ట్రేలియా క్రికెట్‌కు స్టార్ పేస్ బౌలర్ వీడ్కోలు పలికాడు. వెటరన్ పేసర్ కేన్ రిచర్డ్‌సన్ (Kane Richardson) ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతూ తన రిటైర్మెంట్‌ను అధికారికంగా ప్రకటించాడు. తాజాగా ముగిసిన బిగ్ బాష్ లీగ్ సీజన్‌తోనే తన ప్రయాణానికి ముగింపు పెట్టినట్టు వెల్లడించాడు. 34 ఏళ్ల రిచర్డ్‌సన్ సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడిన చివరి బీబీఎల్ సీజన్ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఫైనల్స్‌లో జట్టు పరాజయం పొందిన తర్వాత తన కెరీర్‌ను అక్కడితో ముగించడమే సరైన సమయమని భావించినట్టు తెలిపాడు.

2009లో ప్రొఫెషనల్ క్రికెట్‌లో అడుగుపెట్టిన రిచర్డ్‌సన్ దాదాపు పదిహేనేళ్ల ప్రయాణంలో తనలో ఉన్న ప్రతిభను పూర్తిగా వినియోగించుకున్నాననే తృప్తితో ఈ నిర్ణయానికి వచ్చినట్టు పేర్కొన్నాడు. ఈ ప్రయాణంలో తనను తీర్చిదిద్దిన కోచ్‌లు, నిర్వాహకులు, సహచర ఆటగాళ్లకు కృతజ్ఞతలు తెలిపాడు. ముఖ్యంగా దక్షిణ ఆస్ట్రేలియా, నార్తర్న్ టెరిటరీలో తన ప్రారంభ దశలో సహకరించిన వారిని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నాడు.

అంతర్జాతీయ స్థాయిలో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించడం తనకు గొప్ప గౌరవమని రిచర్డ్‌సన్ భావించాడు. దేశవిదేశాల్లో అనేక ఫ్రాంచైజీల తరఫున ఆడే అవకాశం దక్కడం తన కెరీర్‌లో ప్రత్యేక అనుభవమని చెప్పాడు. డార్విన్‌లో చిన్ననాటి నుంచే క్రికెటర్ కావాలనే కలతో ఎదిగిన తన ప్రయాణాన్ని అభిమానులు అర్థం చేసుకున్నారని ఆశాభావం వ్యక్తం చేశాడు. బిగ్ బాష్ లీగ్ తొలి సీజన్ నుంచే ఆడిన ఆటగాళ్లలో రిచర్డ్‌సన్ ఒకడు. మొత్తం 15 సీజన్లలో పాల్గొని 142 వికెట్లతో టోర్నీ చరిత్రలో ఐదో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. టీ20 ఫార్మాట్‌లో అతడి స్థిరత్వానికి ఇది స్పష్టమైన నిదర్శనం.

అడిలైడ్ స్ట్రైకర్స్, మెల్‌బోర్న్ రెనిగేడ్స్, సిడ్నీ సిక్సర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన రిచర్డ్‌సన్ 2019లో రెనిగేడ్స్‌తో బిగ్ బాష్ టైటిల్‌ను గెలిచాడు. అంతర్జాతీయంగా 25 వన్డేలు, 36 టీ20ల్లో ఆస్ట్రేలియా తరఫున ఆడాడు. 2021 టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన జట్టులో భాగస్వామిగా కూడా ఉన్నాడు. దేశవాళీ క్రికెట్, అంతర్జాతీయ వేదికలు, ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లలో తనదైన ముద్ర వేసిన కేన్ రిచర్డ్‌సన్ (Kane Richardson).. గౌరవప్రదమైన కెరీర్‌తో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Read Also: సంజూ శాంసన్‌కు మరో ఛాన్స్.. ఆశలు ఇంకా ఉన్నాయి !

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>