కలం, వరంగల్ బ్యూరో: సమ్మక్క–సారలమ్మ మహాజాతర వైభవోపేతంగా సాగుతోంది. సోమవారం మేడారం జాతరలో (Medaram Jatara) న్యూజిలాండ్‌కు చెందిన మావోరి తెగ ప్రతినిధులు (Maori Delegates) సందడి చేశారు. గద్దెల ప్రాంగణంలో మావోరి తెగ ప్రతినిధులు వారి సంప్రదాయ నృత్యమైన “హాకా” నృత్యాన్ని ప్రదర్శించారు. మంత్రి సీతక్క వారితో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ఆదివాసీ సంస్కృతికి దేశ సరిహద్దులు, భాషలు అడ్డుకావని, ప్రపంచంలోని ఎక్కడైనా ఆదివాసీలు అడవి, ప్రకృతి మీదే ఆధారపడి జీవనం సాగిస్తారని పేర్కొన్నారు. ఆదివాసీ జీవన విధానం, విశ్వాసాలు ప్రపంచవ్యాప్తంగా ఒకే తత్వాన్ని ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు.
అనంతరం మావోరి తెగ ప్రతినిధులను గద్దల వద్దకు తీసుకెళ్లి వన దేవతల దర్శనం చేయించారు. సమ్మక్క–సారలమ్మ వన దేవతల వైభవం, చరిత్రను మంత్రి సీతక్క స్వయంగా వారికి వివరించారు. ఈ సందర్భంగా బంగారం, వన దేవతల ప్రసాదాన్ని అందజేసి మావోరి తెగ ప్రతినిధులను సన్మానించారు. హాకా నృత్య ప్రదర్శన సందర్భంగా మంత్రి సీతక్క స్వయంగా మావోరి తెగ కళాకారులతో కలిసి నృత్యం చేసి వారి ఉత్సాహాన్ని పెంచారు.
ఏమిటీ హాకా నృత్యం
హాకా నృత్యం మావోరి తెగలో యుద్ధానికి సిద్ధమయ్యే సమయంలో సైనికుల్లో ఉత్సాహం నింపేందుకు, శత్రువుల్లో భయాన్ని కలిగించే విధంగా చేసే సంప్రదాయ నృత్యంగా ప్రసిద్ధి చెందింది. ఈ నృత్యంలో హావభావాలు, శరీర కదలికలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి. ఈ నృత్యాన్ని కళాకారులు ప్రదర్శించారు. తెలంగాణ – న్యూజిలాండ్ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగంగా మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో మావోరి తెగ ప్రతినిధులు (Maori Delegates) మేడారం మహాజాతరను సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: అప్పుడు కేసీఆర్.. ఇప్పుడు రేవంత్.. ఎట్ హోంకు డుమ్మా
Follow Us On: Sharechat


