కలం, తెలంగాణ బ్యూరో: ఐఐటీ విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా కాన్పూర్ (IIT Kanpur) సెంటర్ లో జరుగుతున్న ఘటనలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా 23 ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు) ఉంటే.. వీటిలో రెండేండ్లలో జరిగిన స్టూడెంట్స్ సూసైడ్స్ లో ఒక్క ఐఐటీ కాన్పూర్ లోనే 30 శాతం నమోదయ్యాయి. అక్కడి దారుణ పరిస్థితికి ఇది అద్దం పడున్నది. దాదాపు 7 దశాబ్దాల చరిత్ర గల కాన్పూర్ సెంటర్ లో వరుస ఆత్మహత్యలు విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
అక్కడ సీట్లకు ఫుల్ డిమాండ్
చాలా మంది విద్యార్థులకు ఐఐటీలో సీటు సాధించడం ఓ కల. దాని కోసం చాలా ప్రిపేర్ అవుతుంటారు. అదీ టాప్ 5 సంస్థల్లో చేరాలంటే మరింత ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. దేశంలోని టాప్ ఐఐటీల్లో కాన్పూర్ (IIT Kanpur) ఒకటి. 1959లో ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఇది ఏర్పడింది. ఇందులో అండర్ గ్రాడ్యుయేషన్ (B.Tech), పోస్టు గ్రాడ్యుయేషన్ (M.Tech/MBA), పీహెచ్ డీ స్థాయిలో కోర్సులు న్నాయి. ఎక్కువగా ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అందుకోసం చాలా మంది పోటీ పడుతుంటారు. పైగా ఓల్డెస్ట్ ఐఐటీ కావడంతో ప్లేస్ మెంట్ ఈజీగా వస్తుందన్న నమ్మకం ఉంటుంది. వెయ్యి ఎకరాల్లో విస్తరించిన ఈ యూనివర్సిటీలో ఖారగ్ పూర్, బాంబే, ఢిల్లీ, మద్రాస్ ఐఐటీలతో పోలిస్తే.. సీట్ల సంఖ్య తక్కువే! డిమాండ్ మాత్రం ఫుల్.
రెండేండ్లలో 9 మంది ఆత్మహత్య
టాప్ 5 ఐఐటీల్లో ఒకటైన కాన్పూర్ సెంటర్ లో రెండేండ్లలో తొమ్మిది మంది విద్యార్థులు ఆత్మహత్య (IIT Student Suicides) చేసుకున్నారు. ఎర్త్ సైన్సెస్ డిపార్ట్ మెంట్ లో పీహెచ్ డీ చేస్తున్న రామ్ స్వరూప్ అనే స్కాలర్ ఈ నెల 20న క్యాంపస్ లోని ఆరవ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. కొంత కాలంగా అతడు తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తేలింది. కేవలం 23 రోజుల వ్యవధిలోనే ఇక్కడ జరిగిన రెండో ఆత్మహత్య ఇది. డిసెంబర్ 29న జైసింగ్ మీనా అనే బీటెక్ స్టూడెంట్ ప్రాణాలు కోల్పోయారు. 2023 డిసెంబర్ 19న పల్లవి, 2024 జనవరి 10న వికాస్ మీనా, జనవరి 18న ప్రియాంక జైస్వాల్, అక్టోబర్ 10న ప్రగతి, 2025 ఫిబ్రవరి 10న అంకిత్ యాదవ్, ఆగస్టు 25న దీపక్ చౌదరీ, అక్టోబర్ 1న ధీరజ్ సైనీ, డిసెంబర్ 29న జైసింగ్ మీనా, 2026 జనవరి 20న రామ్ స్వరూప్ ఆత్మహత్య చేసుకున్నారు. దేశవ్యాప్తంగా రెండు సంవత్సరాల్లో 27 మంది ఐఐటీ స్టూడెంట్లు ఆత్మహత్య చేసుకుంటే.. ఇందులో తొమ్మిది మంది ఐఐటీ కాన్పూర్ స్టూడెంట్లే ఉన్నారు. ఏడుగురు ఐఐటీ ఖారగ్పూర్ స్టూడెంట్లు. ఐఐటీ కాన్పూర్ లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపడంతో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ముగ్గురు సభ్యులతో కమిటీని వేసింది. 15 రోజుల్లో ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది.
కౌన్సిలర్లూ ప్రొఫెసర్ల బంధువులే!
ఐఐటీల్లో విద్యార్థుల మానసిక సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు కౌన్సిలర్లు ఉన్నా ఫలితం లేదు. ముఖ్యంగా కాన్పూర్ సెంటర్ లో పరిస్థితి దారుణంగా ఉందని అక్కడి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండేండ్లలో తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకోవడం ఇందుకు ఉదాహరణ అని.. ఇతర ఐఐటీలతో పోలిస్తే 30 శాతం ఇక్కడే జరిగాయని చెప్తున్నారు. కౌన్సిలర్లు, వెల్ నెస్ సెంటర్లు, హెల్ప్ లైన్లు.. ఇలా అన్నీ ఉన్నా ఉపయోగం లేదని ఇక్కడ పూర్వ విద్యార్థి ధీరజ్ సింగ్ వాపోయారు. విద్యార్థులు కౌన్సిలింగ్ సెంటర్లకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. అక్కడ తమకు ప్రైవసీ ఉండటం లేదని, అక్కడి వెళ్లి సమస్య చెప్పుకుందామంటే వినే దిక్కులేదని అంటున్నారు. ప్రొఫెసర్ల ఇంటివాళ్లు, బంధువులే కౌన్సిలర్లుగా ఉంటున్నారని, వాళ్లతో తమ సమస్యలు ఎలా చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు.
అసైన్ మెంట్లు ఇవ్వలేదనీ ఇంటికి..!
ఆ మధ్య ఓ విద్యార్థి హెల్త్ ఇష్యూతో టైమ్ కి అసైన్ మెంట్లు సమర్పించలేదు. దానికి ఐఐటీ కాన్పూర్ యాజమాన్యం సీరియస్ యాక్షన్ తీసుకుంది. వర్సిటీ నుంచి స్టూడెంట్ ను తొలగించింది. దీంతో సదరు స్టూడెంట్ ఐఐటీ ఖారగ్ పూర్ లో చేరి ఏ గ్రేడ్ సాధించాడు. అంటే సమస్య విద్యార్థుల్లో లేదని, ఐఐటీ కాన్పూర్ యాజమాన్యం అనుసరిస్తున్న విధానాల్లో ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి.
స్కాలర్లా.. బానిసలా..?
ఐఐటీ కాన్పూర్ లో పీహెచ్ డీ స్కాలర్లను బానిసలుగా చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. స్కాలర్ల సేవలను గైడ్లు తమ అవసరాల కోసం వాడుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడి పూర్వ విద్యార్థి ధీరజ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘స్కాలర్లను బానిసలుగా చూస్తున్నారు. రీసెర్చ్ తో సంబంధం లేని పనులను కూడా ప్రొఫెసర్లు చేయిస్తున్నారు” అని తెలిపారు. 2023 జులై సర్వే ప్రకారం.. ఐఐటీ కాన్పూర్ లోని 80శాతం మంది స్టూడెంట్లు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. ఆత్మహత్యలు జరిగినప్పుడల్లా యాజమాన్యం సాకులు చెప్తున్నదని.. స్టూడెంట్లపైనే నెపం మోపుతున్నదని విమర్శలు వస్తున్నాయి.
ఐఐటీ మద్రాస్ లా మారేనా?
టాప్ 5లో ఉన్న ఐఐటీ మద్రాస్ లో కూడా ఒకప్పుడు విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపాయి. 2023లో ఇక్కడ ఓ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోగా.. ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. ప్రొఫెసర్ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు కమిటీ విచారణలో వెల్లడైంది. ఆ ప్రొఫెసర్ ను సస్పెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడ రెండేండ్లలో ఒక్క ఆత్మహత్య కూడా నమోదు కాలేదు. అంటే.. శిక్ష పడుతుందనే భయంతోనే వ్యవస్థ అంతా సెట్ అయిందని విద్యార్థులు అంటున్నారు. కానీ, ఐఐటీ కాన్పూర్ లో (IIT Kanpur) అలాంటి చర్యలు ఏమీ లేవని.. అందుకే తాము భయం భయంగా బతకాల్సి వస్తున్నదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: రూ.400కోట్ల డబ్బున్న కంటైనర్ అపహరణ.. తిరుపతి లింక్!
Follow Us On: X(Twitter)


