కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన స్థానాల్లో మళ్లీ ఎన్నికలు పెట్టాలని కేటీఆర్(KTR) సవాల్ విసిరారు. తెలంగాణ భవన్‌లో పలువురు బీఆర్ఎస్(BRS) పార్టీలో చేరిన సందర్బంగా కేటీఆర్ మాట్లాడారు. అసెంబ్లీ స్పీకర్ పరిస్థితి ద్రుతరాష్ట్రుడిగా మారిందని, కళ్ల ముందే పార్టీ మారిన వాళ్లు కనిపిస్తుంటే పార్టీ మారలేదని అంటున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే యాదయ్య బీఆర్ఎస్ తరఫున గెలిచాడని, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో కాంగ్రెస్ కండువా కప్పించుకొని ఆ పార్టీలో తిరుగుతున్నారని, ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే యాదయ్య బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని స్పీకర్ అంటున్నారని కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) నిజంగానే ప్రజలకు మంచి చేస్తే, అభివృద్ధి పనులు చేసి ఉంటే, ఆరు గ్యారంటీలు అమలు చేస్తే, మహిళలు ఈ పాలనలో సంతోషంగా ఉంటే ఎందుకు ఎన్నికలకు రావడం లేదని ప్రశ్నించారు. యాదయ్యతో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికలు పెట్టి కాంగ్రెస్ చేసిన మంచిని చెప్పుకొని గెలిచే సత్తా ఉందా అని నిలదీశారు. కాంగ్రెస్ పాలనపై అందరూ కోపంగా ఉన్నారని , ఆ విషయం ఆ పార్టీ నాయకులకు కూడా తెలుసని చెప్పారు.
కేసీఆర్(KCR) పాలనలో డిసెంబర్‌లో రైతుబంధు వచ్చేదని కేటీఆర్ అన్నారు. రేవంత్ పాలనలో జనవరి 26 వచ్చినా రావడం లేదని తెలిపారు. ఏం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిని గట్టిగా నిలదీస్తే కేసులు పెడుతున్నారన్నారు. రేవంత్‌కు పాలన చేతకావడం లేదని, కేసీఆర్‌ను తిట్టడం తప్ప రేవంత్ ఈ రెండేళ్లలో చేసింది ఏమీ లేదన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలతో పాటు, చెప్పని పనులు కూడా ఎన్నో చేశారన్నారు. రైతుబంధు, కళ్యాణ లక్ష్మి వంటివి అందించినట్లు గుర్తు చేశారు. చేవెళ్లలో మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ నేతలు మళ్లీ వస్తారని, చీరలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి ఓట్లు వేయమని అడుగుతారని చెప్పారు. ప్రజలు ఒకసారి మోసపోయారని, మళ్లీ మోసపోవద్దని సూచించారు.


