epaper
Sunday, January 25, 2026
spot_img
epaper

మీ ఆటలు సాగవు.. సీపీ సజ్జనార్​ వార్నింగ్​

కలం, వెబ్​ డెస్క్​: ఆడబిడ్డల జోలికొస్తే కఠిన చర్యలు తప్పవని, వేధింపులకు పాల్పడే వారి భవిష్యత్తు జైలు గోడల మధ్యే అంతమవుతుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ (VC Sajjanar) హెచ్చరించారు. మహిళల రక్షణ కవచంలా షీ టీమ్స్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని, బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళల భద్రత విషయంలో హైదరాబాద్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోరని వీసీ పేర్కొన్నారు. మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి పోలీసుల సహాయం కోరాలని పిలుపునిచ్చారు. డిజిటల్ బ్లాక్‌మైలింగ్‌, సైబర్ స్టాకింగ్‌ వంటి వేధింపులను ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు.

ఏడాదిలో 1,149 ఫిర్యాదుల పరిష్కారం

నగరంలో మహిళల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్న షీ టీమ్స్ గడిచిన ఏడాది కాలంలో అద్భుతమైన సమర్థతను చాటుకున్నాయి. ఏడాది పొడవునా అందిన 1,149 ఫిర్యాదులను అత్యంత బాధ్యతాయుతంగా పరిష్కరించి బాధితులకు అండగా నిలిచాయి. కేవలం ఫిర్యాదులకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో 15 బృందాలు మఫ్టీలో నిఘా ఉంచి 3,826 మంది పోకిరీలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సీపీ తెలిపారు.

బ్లాక్‌మెయిలింగ్ ముఠాల ఆటకట్టు

ఈ ఏడాది నమోదైన కేసుల్లో అత్యధికంగా 366 మంది బాధితులు బ్లాక్‌మెయిలింగ్ సమస్యతోనే పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో పరిచయమై, వ్యక్తిగత ఫోటోలు మరియు వీడియో కాల్స్‌ను రికార్డ్ చేసి వేధిస్తున్న వారి నుంచి షీ టీమ్స్ రక్షణ కల్పించింది. ప్రేమ విఫలమైన తర్వాత పాత ఫోటోలతో బెదిరింపులకు పాల్పడుతున్న మాజీ ప్రేమికులపై కూడా కఠిన చర్యలు తీసుకున్నారు.

సాంకేతిక వేధింపులపై ఉక్కుపాదం

స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా యాప్స్ వేదికగా సాగుతున్న ఆగడాలను పోలీసులు అడ్డుకున్నారు. అర్ధరాత్రి వేళల్లో అసభ్యకర కాల్స్ చేస్తున్న వారిపై 121 కేసులు, నకిలీ సోషల్ మీడియా ఖాతాలతో వేధిస్తున్న (Social Media Harassment) వారిపై 82 కేసులు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులను గుర్తించి బాధితులకు మానసిక ప్రశాంతతను చేకూర్చారు.

మోసగాళ్లకు చెక్

పెళ్లి పేరుతో నమ్మించి, శారీరకంగా, ఆర్థికంగా వాడుకుని ముఖం చాటేస్తున్న వారిపై కూడా షీ టీమ్స్ దృష్టి సారించాయి. ఇలాంటి 98 ఫిర్యాదులను స్వీకరించి, బాధితులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు దోషులపై క్రిమినల్ కేసులు నమోదు చేయించారు.

నిరంతర నిఘా, కౌన్సెలింగ్

నగరవ్యాప్తంగా బస్టాండ్లు, కాలేజీలు, రద్దీ ప్రదేశాలలో మఫ్టీలో ఉన్న షీ టీమ్స్ బృందాలు వేధింపులకు పాల్పడుతున్న 3,826 మందిని పట్టుకున్నాయి. వీరిలో మెజారిటీ వ్యక్తులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. నేర తీవ్రత ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేసి జైలుకు పంపారు.

మహిళలు తమ వివరాలు బయటకు వస్తాయనే భయం పడాల్సిన అవసరం లేదని, ఫిర్యాదుదారుల సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతామని సీపీ వీసీ సజ్జనార్​ (VC Sajjanar) తెలిపారు. ఏదైనా ఆపదలో ఉన్నా లేదా వేధింపులకు గురవుతున్నా తక్షణమే డయల్ 100 లేదా షీ టీమ్స్ వాట్సాప్ నెంబర్ 9490616555 కు సమాచారం అందించాలని ఆయన సూచించారు.

Read Also: మహేశ్‌కుమార్ గౌడ్‌కు కవిత ఆఫర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>