కలం, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌లో (Bangladesh) హిందువులపై దాడులు ఆగడం లేదు. గతేడాది భారత వ్యతిరేక అల్లర్లతో మొదలైన దాడులు, హత్యాకాండ కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది దీపూ చంద్ర దాస్‌ను చెట్టుకు కట్టి సజీవ దహనం (Burned Alive) చేసిన విధంగానే ఆదివారం మరో హిందూ యువకుడిని పెట్రోల్ పోసి తగలబెట్టారు. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కమిల్లా జిల్లా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన చంచల్ చంద్ర భౌమిక్ (Chanchal Chandra) (23) కొన్నేళ్లుగా నార్సింగ్డిలోని మసీద్ మార్కెట్లో ఉన్న ఓ గ్యారేజ్‌లో పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి గ్యారేజీలో నిద్రపోతుండగా, కొందరు దుండగులు దుకాణం షట్టర్లకు తాళం వేసి, అనంతరం పెట్రోల్ పోసి అంటించారు.
షాపు తగలబడుతుండడం చూసి స్థానికులు ఫైర్ సర్వీస్‌కు కాల్ చేశారు. అగ్నిమాపక దళం వచ్చేసరికి సుమారు గంటపైనే పట్టింది. ఈలోపే దుకాణం తగలబడింది. ఫైర్ సర్వీస్ సిబ్బంది మంటలార్పి, చంచల్ (Chanchal Chandra) మృతదేహాన్ని బయటకు తీశారు. మంటల్లో చిక్కుకున్న చంచల్ మృతదేహం గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది. గ్యారేజీ తగలబడుతుండగా, ప్రాణభయంతో చంచల్ కేకలు పెట్టినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. పక్కాగా ప్లాన్ చేసి చంచల్‌ను హత్య చేశారని, బాధిత కుటుంబం ఆరోపించింది. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. కాగా, షాపు మంటల్లో చిక్కుకొని తగలబడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చంచల్ హత్య బంగ్లాదేశ్‌లో మైనారీటీలు.. ముఖ్యంగా హిందువుల భద్రతపై మరోసారి చర్చ లేవనెత్తింది. దాడులు, హత్యలు జరుగుతున్నా బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్ పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మరోవైపు వచ్చే నెలలో జరగనున్న దేశ సార్వత్రిక ఎన్నికల సమయంలో మరిన్ని దాడులు జరగొచ్చనే ఆందోళనలు హిందువుల్లో వ్యక్తమవుతున్నాయి.
Read Also: మీ ఆటలు సాగవు.. సీపీ సజ్జనార్ వార్నింగ్
Follow Us On: Pinterest


