కలం, ఖమ్మం బ్యూరో: ‘‘మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) నగారా మోగనుంది. మనమంతా సిద్ధం కావాలి. అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయమే తుది నిర్ణయం. పైరవీలకు ఇక్కడ తావులేదు. జనం కోరుకునే వ్యక్తికే బి-ఫామ్ దక్కుతుంది’’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మంక్యాంపు కార్యాలయంలో పాలేరు నియోజకవర్గ పరిధిలోని ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
టికెట్ల కేటాయింపుపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. “వారసత్వ రాజకీయాలకు నా వద్ద చోటు లేదు. నా రక్తసంబంధీకులకు ఎవరికీ టికెట్లు ఇవ్వను. ఇప్పటికే రెండు మూడు బృందాలతో క్షేత్రస్థాయిలో సర్వేలు చేయిస్తున్నాం. ప్రజలు ఎవరినైతే ఆదరిస్తారో, ఎవరికైతే గెలిచే సత్తా ఉందో వారికే అవకాశం దక్కుతుంది. ఓటర్ల మనసు గెలుచుకున్నవారే అభ్యర్థులుగా బరిలోకి దిగుతారు” అని పొంగులేటి (Ponguleti Srinivasa Reddy) పేర్కొన్నారు.
పార్టీలో టికెట్ రాని వారు నిరాశ చెందవద్దని, అసంతృప్తితో ఇతర పార్టీల వైపు చూడవద్దని మంత్రి సూచించారు. “అధికారంలో ఉన్నాం కాబట్టి అందరికీ ఏదో ఒక రూపంలో సముచిత స్థానం కల్పిస్తాం. కొందరిని కో-ఆప్షన్ సభ్యులుగా, మరికొందరిని నామినేటెడ్ పదవుల ద్వారా గౌరవిస్తాం. పార్టీని కాదని స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలని ఎవరైనా రెచ్చగొడితే మోసపోవద్దు’’ అని అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా మార్చడమే తన లక్ష్యమని మంత్రి వివరించారు. కార్యకర్తలే బలమని, ప్రజలతో నిరంతరం మమేకమై ఉండే వారికే తన మద్దతు ఉంటుందని మంత్రి పొంగులేటి అన్నారు.
Read Also: సోలార్ తయారీ హబ్‌గా ఆంధ్రప్రదేశ్.. లోకేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
Follow Us On: Pinterest


