కలం, వెబ్ డెస్క్: నాంపల్లి అగ్ని ప్రమాద(Nampally Fire Accident) ఘటనపై ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్(Vikram Singh Mann) కీలక వ్యాఖ్యలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించడంతోనే అగ్ని ప్రమాదం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఫర్నీచర్ షాప్ యాజమాన్యం బేస్మెంట్లో ప్రమాదకర కెమికల్స్, రెగ్జీన్, మాట్రెస్ వంటివి పెట్టడం వల్ల ఎంత కష్టపడ్డా మంటలను అదుపు చేయడానికి ఆలస్యమైందన్నారు. బేస్మెంట్లో రెండు గదులు ఏర్పాటు చేసి వాచ్మెన్ కుటుంబాన్ని అక్కడే నివసించేలా ఏర్పాట్లు చేశారని, అది కూడా నిబంధనలు ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు.
బేస్మెంట్ చివరలో రెండు గదులు ఉన్నాయని, మంటలు మొదలయ్యాక వాళ్లు గదుల నుంచి బయటకు వచ్చి ర్యాంప్ వైపు పరుగెత్తారని డీజీ తెలిపారు. కానీ, సీలింగ్ వరకు సామాగ్రితో మొత్తం ప్యాక్ చేసి ఉండటంతో బయటకు రాలేకపోయారన్నారు. ర్యాంప్ మొత్తం బ్లాక్ అవ్వడంతో ఎటూ వెళ్లలేకపోయారని తెలిపారు. మెట్లపైకి ఎక్కడంతో అక్కడొక షటర్ ఉందని, అది తాళం వేసి ఉందని చెప్పారు. దీంతో ఎటూ వెళ్లలేక ఐదుగురు అందులోనే ఉండిపోవాల్సి వచ్చిందన్నారు. ర్యాంప్ దగ్గర మహిళ మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఇద్దరి మృతదేహాలు రూం దగ్గర, మరో ఇద్దరి మృతదేహాలు షటర్ దగ్గర గుర్తించినట్లు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ లేదా సిగరెట్ ద్వారా అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగి ఉండవచ్చని డీజీ వెల్లడించారు. షాపు యజమాని సతీష్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమాచారం వచ్చిన రెండు నిమిషాల్లోనే రక్షణ చర్యలు ప్రారంభమయ్యాయని ఫైర్ డిపార్ట్మెంట్ 200 సిబ్బంది సహా, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హైడ్రా, తదితర శాఖలు విధుల్లో పాల్గొన్నాయని తెలిపారు.


