కలం, వెబ్ డెస్క్: సింగరేణి బొగ్గు స్కాం(Singareni Coal Scam)లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్(Harish Rao) రావు ఆరోపించారు. సింగరేణి టెండర్ల గురించి వస్తున్న ఆరోపణలపై డిప్యూటీ సీఎం భట్టి శనివారం మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. దీనిపై స్పందిస్తూ హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి టెండర్లలో పారదర్శకత లేదని హరీశ్ వ్యాఖ్యానించారు. బొగ్గు స్కాంపై స్పష్టమైన వివరణ ఇవ్వకుండా భట్టి మాటల గారడీ చేశారని విమర్శించారు. సింగరేణి స్కాంపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోందన్నారు. అధికార పార్టీ నేతల స్వార్థం కోసమే సింగరేణిలో కొత్త నిబంధనలు తీసుకొచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొన్ని సంస్థలను టెండర్లలో పక్కన పెట్టారని తెలిపారు. తమ వారికి టెండర్లను ఇచ్చుకునేందుకే ఇలా చేశారని ఆరోపించారు. 2018 నుంచే సైట్ విజిట్ నిబంధన ఉందని భట్టి మాట్లాడారని, పూర్తిగా అవాస్తవం అని హరీశ్ వెల్లడించారు. సింగరేణి టెండర్లపై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడతానని భట్టి అంటున్నారని, స్వయంగా సీఎం అవినీతి చేస్తుంటే ఆయనతో ఏం మాట్లాడతారని ప్రశ్నించారు.
2025 మే నుంచి ఎన్ని సంస్థలను టెండర్లకు పిలిచారని హరీశ్ రావు ప్రశ్నించారు. నైనీ కోల్ బ్లాక్‌తో పాటు అన్ని టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి కోల్ స్కాం, సోలార్ స్కాం మాత్రమే తాను బయటపెట్టానని, ఇంకా చాలా స్కాంలు ఉన్నాయని హరీశ్ రావు అన్నారు. త్వరలో మరిన్ని ఆధారాలతో సహా బయటపెడతానని హరీశ్ చెప్పారు. సింగరేణి టెండర్లు ఎవరికి ఇవ్వాలన్నది సీఎం బావమరిది సృజన్‌రెడ్డి నిర్ణయించారని, మరి సింగరేణి స్కాంకు ఎవరు బాధ్యులు అని హరీశ్ ప్రశ్నించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్‌పై భట్టి అవాస్తవాలు చెప్పారని హరీశ్ రావు అన్నారు. పిల్లల బట్టలు ఆరవేసే క్లోత్ డ్రయర్పై కేంద్రం సైట్ విజిట్ పెట్టిందని దానికి , కోల్కి సంబంధం ఉందా అని హరీశ్ రావు ప్రశ్నించారు. సివిల్ సప్లై స్కాం, ఇసుక స్కాం, కోల్ స్కాం, ఫోర్త్ సిటీ స్కాం…. ఇలా కాంగ్రెస్ వచ్చాక ఎన్నో స్కాములు జరిగాయన్నారు. సింగరేణి కార్మికుల బోనస్‌లో కోతపెట్టి ఫుట్‌బాల్ కోసం వాడుకున్నారని సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారు. సింగరేణి కార్మికుల కష్టాన్ని టెండర్లతో దండుకోవాలని చూస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హరీశ్ హెచ్చరించారు. బొగ్గు కథనంతోనే కాంగ్రెస్ పతనం మొదలైందని, బొగ్గు స్కాంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.


