కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో అగ్నిప్రమాదాల ఘటనలు ఆగడం లేదు. తాజాగా నాంపల్లి (Nampally Fire Accident) ఘటనతో మరోసారి నగరం ఉలిక్కిపడింది. ఇక్కడి బాత్చా ఫర్నీచర్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మొత్తం ఆరుగురు మంటల్లో చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్ శ్రమిస్తూనే ఉంది. మంటల్లో చిక్కుకున్న వారిలో ఇద్దరు చిన్నారులు ఉండటం అందరినీ కలచివేస్తోంది. గతంలో జరిగిన ఘోర ప్రమాదాల జ్ఞాపకాలు ఇంకా జనం మదిలోనుంచి చెరిగిపోలేదు. అంతలోనే మళ్లీ ఇటువంటి ఘటనే జరగడం యంత్రాంగం వైఫల్యానికి అద్దం పడుతోంది. ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టు న్యాయవాది ఇమ్మనేని రామారావు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.
అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ యంత్రాంగం అలసత్వంతో అగ్ని ప్రమాదాలకు నివారణ లేకుండా పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, అధికారులపై రాజకీయ ఒత్తిళ్ళు, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం.. ఇలాంటి అనేక కారణాలతో నిబంధనలు లేకుండానే నిర్మాణాలు జరుగుతున్నాయని, చివరకు ప్రమాదాల నివారణకు మార్గం లేకుండా పోతున్నదని పేర్కొన్నారు.
అక్రమ కట్టడాల వల్లే అగ్ని ప్రమాదాలు
హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలకు అక్రమ కట్టడాలే కారణమని తెలుస్తోంది. నవంబర్ 13, 2023న నాంపల్లిలోని ఒక అక్రమ సెల్లార్‌లో మంటలు చెలరేగి తొమ్మిది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మే 17, 2025న గుల్జార్ హౌస్‌లో జరిగిన మరో భారీ అగ్నిప్రమాదంలో ఏకంగా 17 మంది సజీవ దహనమయ్యారు. ఈ రెండు ఘటనలకు కాలం చెల్లిన నిర్మాణాలు, అనుమతులు లేని దుకాణాల నిర్వహణ ఫైర్ సేఫ్టీ పాటించకపోవడమే కారణంగా తెలుస్తోంది. నాంపల్లి అగ్ని ప్రమాద ఘటన (Nampally Fire Accident) అనంతరం అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి.
ప్రమాదంలో 2 లక్షల భవనాలు
హైదరాబాద్‌లోని మొత్తం 2.6 లక్షల నివాస సముదాయాలు ప్రస్తుతం డేంజర్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. వీటిలో దాదాపు 13 లక్షల మంది నివసిస్తున్నారు. వీరిలో అత్యధికులు నిరుపేదలే కావడం గమనార్హం. నాంపల్లి పరిసరాల్లోని అక్రమ కట్టడాలకు ప్రధానంగా ఈ క్రింది అంశాలే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అవినీతి, నిర్లక్ష్యం ఈ ప్రమాదాలకు కారణమని సమాచారం. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం కూడా మరో కారణంగా ఉంది. నిబంధనలు ఉల్లంఘించిన భవనాలపై చర్యలు తీసుకోకుండా అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నట్టు సమాచారం. వివిధ ప్రభుత్వశాఖల మధ్య తగిన అవగాహన లేకపోవడం వల్ల అనుమతులు లేని భవనాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కొన్ని పురాతన కాలంనాటి భవనాలు కొనసాగుతున్నాయి.
కమిషనర్ కర్ణన్‌కు వినతి
ఈ పరిస్థితులపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మానవ హక్కులు, పౌర సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ కమిషనర్ మిస్టర్ కర్ణన్ ఐఏఎస్ తక్షణమే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నాంపల్లి పరిసరాల్లోని అన్ని అక్రమ కట్టడాలపై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అగ్నిమాపక నిబంధనలు పాటించని వాణిజ్య సంస్థల లైసెన్సులను తక్షణమే రద్దు చేయాలని కోరుతున్నారు. ఫైర్ సేఫ్టీ పర్మిట్లు లేని భవనాలను సీజ్ చేసి, అక్కడ కార్యకలాపాలను ఆపించేయాలని కోరతున్నారు. తాజా ప్రమాదంలో చిక్కుకున్న మరియు ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు తగిన ఆర్థిక సాయం అందించాలి. అభివృద్ధి పేరుతో అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తే, హైదరాబాద్ నగరం ఒక “ఫైర్ బాంబు”గా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరుస్తారా? వేచి చూడాలి.
Read Also: విచారణను నిలిపేసేలా ఆదేశాలివ్వండి.. ఢిల్లీ హైకోర్టుకు ‘ఆపిల్’ కంపెనీ అప్పీల్
Follow Us On : WhatsApp


