కలం, మహబూబాబాద్ : రానున్న కాలంలో మరింత అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కోరారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం (Kesamudram) మండల కేంద్రంలో రూ.151 కోట్ల తో వివిధ అభివృద్ధి పనులకు మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రభుత్వం కూలుతుందని కొందరు పిల్లి శాపనార్థాలు పెట్టారని విమర్శించారు.
గత 10 సంవత్సరాలుగా మీకు ఎన్ని డబుల్ బెడ్ రూం లు వచ్చాయో, ఇప్పుడు నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు, గిరిజన ప్రాంతాల్లో మరో వెయ్యి అదనంగా ఇచ్చామన్నారు. ఇండ్లు కట్టుకునేందుకు 8 ట్రాక్టర్ల ఇసుక ఉచితంగా ఇస్తున్నామని, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందిస్తున్నట్లు తెలిపారు. రెండేళ్లలో 9 వేల కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కి గ్యాస్ అందిస్తున్నామన్నారు. సన్న బియ్యం, నూతనంగా రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు పొన్నం (Ponnam Prabhakar) తెలిపారు.
మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చామని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అనేక కార్యక్రమాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, రాష్ట్ర రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్, రాష్ట్ర ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ డాక్టర్ శబరీష్ పాల్గొన్నారు.
Read Also: నుమాయిష్ ఎగ్జిబిషన్ కు ఎవరూ రావొద్దు : సీపీ సజ్జనార్
Follow Us On: Sharechat


