epaper
Saturday, January 24, 2026
spot_img
epaper

ఎవ్వ‌రి హెచ్చ‌రిక‌ల‌కు భ‌య‌ప‌డ‌ను.. స‌జ్జ‌నార్ నోటీసుల‌పై స్పందించిన‌ ప్రవీణ్ కుమార్

క‌లం, వెబ్ డెస్క్: సీపీ స‌జ్జ‌నార్ (CP Sajjanar) త‌న‌కు నోటీసులు పంపించ‌డంపై బీఆర్ఎస్ (BRS) నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ (RS Praveen Kumar) స్పందించారు. తాను ఎవ్వ‌రి హెచ్చ‌రిక‌ల‌కు భ‌య‌ప‌డ‌డ‌ని స్ప‌ష్టం చేశారు. తాను వ్యక్తిగత దూషణలు చేయన‌ని, చిల్లర భాషను వాడన‌ని చెప్పారు. ప్ర‌జా క్షేత్రంలో వాస్తవాలు దాచన‌ని, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా త‌న పోరాటాన్ని ఆపేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్, హరీశ్‌రావుల‌కు సంబంధం లేకున్నా సిట్ నోటీసులు ఇచ్చింద‌న్నారు. గంటల తరబడి దర్యాప్తు పేరిట వేధిస్తున్న ప్రహసనాన్ని నిన్న తెలంగాణ భవన్ లో పత్రికా సమావేశంలో ఖండించిన 12 గంటలలోపే రాత్రి 12 గంటలకు త‌న‌ ఇంటికి వచ్చి పోలీసులు త‌న‌కు నోటీసు ఇచ్చార‌ని తెలిపారు. రెండు రోజుల్లో ఆధారాలతో సహా స‌మాధానం ఇవ్వకపోతే సివిల్, క్రిమినల్ చర్యలకు సిద్దం కావాలని హెచ్చ‌రించార‌న్నారు.

ప్రజా సమస్యలపై, దౌర్జన్యాలపై గొంతెత్తడం త‌న‌ హక్కు అని, ఇలాంటి హెచ్చ‌రిక‌ల‌కు భయపడేది లేద‌ని తెలిపారు. త‌న‌ దగ్గర ఉన్న సమాచారంతో జవాబు ఇస్తాన‌ని, తరువాత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని తేల్చి చెప్పారు. ఆయ‌న శుక్ర‌వారం మీడియా సమావేశంలో చెప్పిన కీలకమైన విషయాల‌పై మ‌రోసారి స్పష్టత ఆర్ఎస్పి (RS Praveen Kumar) ఇచ్చారు.

దేశ రక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం, వ్వవస్థీకృత నేరాల నివారణ కోసం టెలీఫోన్ ట్యాపింగ్ చేయడం నేరం కాదని చట్టమే చెప్పింద‌న్నారు. దీనికి అనేక మార్గదర్శకాలు ఉన్నాయ‌ని తెలిపారు. అనేక మంది అధికారులు రకరకాల స్థాయిల్లో దీన్ని పర్యవేక్షిస్తార‌ని చెప్పారు. ఇది ఒక్క ఆఫీసర్ వల్ల అయ్యే పని కాద‌ని, ఈ విషయాన్నే దివంగత ప్రధాని డా.మన్మోహన్ సింగ్ చెప్పార‌ని తెలిపారు. రేవంత్ రెడ్డి ట్యాపింగ్ జరగడం మామూలే అని ఢిల్లీలో చెప్పినట్లు కూడా వార్తలున్నాయ‌ని, అలాంటప్పుడు సిట్ దర్యాప్తు ఎందుకు? అని ప్ర‌శ్నించారు.

తాను సిట్ ఛీఫ్ సజ్జనార్ మీద ఆంధ్ర ప్రదేశ్ లో నమోదైన కేసుల మీద మరో సిట్ వేయాల‌ని డిమాండ్ చేసినట్లుగా నోటీసులో ఉంద‌ని, ఇది వాస్తవం కాద‌ని పేర్కొన్నారు. దీనిపై తాను చెప్పి విష‌యాన్ని మ‌రోసారి వివ‌రించారు. గతంలో ఓటుకు నోటు కేసులో లైవ్ కెమెరాలో రేవంత్ రెడ్డి దొరికిన తరువాత, ఆంధ్ర ప్రదేశ్ నాయకుల ఫోన్లు తెలంగాణ ప్రభుత్వం, ఇంటలీజెన్స్ అధికారులు ట్యాప్ చేశారని, 2015 జూన్ లో ఏపీలో చాలా పోలీసు స్టేషన్లలో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేసులు నమోదయ్యాయని పత్రికల్లో చాలా వార్తలొచ్చాయ‌ని తెలిపారు. ఆ సమయంలో ఏపీలో కూడా ఒక సిట్ కూడా ఏర్పాటు అయ్యింద‌న్నారు. ఆ స‌మ‌యంలో సీపీ సజ్జనార్ కూడా తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగంలో అధికారిగా పని చేశార‌న్న అవగాహన త‌న‌కు ఉంద‌న్నారు. అందుకే ఆయన ఇప్పుడు ట్యాపింగ్ వ్యవహారంపై వేసిన రెండో తెలంగాణ సిట్‌కు ఛీఫ్ గా ఉండటం నైతికంగా స‌రికాద‌ని అభిప్రాయ‌ప‌డ్డ‌ట్లు తెలిపారు. ఇది రాజ్యాంగం త‌న‌కు కల్పించిన హక్కు అని, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రజల ముందుకు ఈ విషయాలను తీసుకురావాల్సిన కనీస బాధ్యత త‌న‌పై ఉంద‌ని తెలిపారు. ఇది న‌చ్చని వాళ్లు త‌న‌కు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని చెప్పారు.

అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పలు కుంభకోణాల మీద సిట్ వేయాలని డిమాండ్ చేశాన‌న్నారు. పోలీస్ అధికారులు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాజకీయ క్రీడలో పావులుగా మారవద్దని సలహా ఇచ్చాన‌న్నారు. నాటి డీజీపి, హోం సెక్రెటరీ, ఛీఫ్ సెక్రటరీలాంటి అధికారులను అందరినీ విడిచిపెట్టి సిట్ అధికారులు కేవలం ప్రభాకర్ రావును, వారి కుటుంబాన్ని, ఆయనతో పని చేసిన కానిస్టేబుళ్లను, బంధువులను వేధించడం అన్యాయ‌ని చెప్పిన‌ట్లు తెలిపారు. కేవలం కొంతమంది పోలీసు అధికారుల కనుసన్నల్లోనే అత్యంత గోప్యంగా జరగాల్సిన ఈ ట్యాపింగ్ ప్రజల నోళ్లలో తరచుగా నానడం ప్రమాదకర‌మ‌ని హెచ్చరించాన‌ని పేర్కొన్నారు.

తాను సజ్జనార్‌తో సహా ఏ అధికారి, ఏ రాజకీయ నాయకుడి వ్యక్తిత్వ హననానికి పాల్పడలేద‌ని స్ప‌ష్టం చేశారు. వాస్త‌వానికి కేటీఆర్, హరీష్ రావు, మరెందరో బీఆర్ఎస్ నాయకులు గత రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలనలో తీవ్రమైన వ్యక్తిత్వ హననానికి గురయ్యార‌న్నారు. ఆ విషయంలో నిందితులపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ‘మేము ముమ్మాటికీ బాధితులం. ప్రజల గొంతుగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం. ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా మా పోరాటం ఆగదు. మీ నోటీసులకు మేము అదరం, బెదరం..’ అని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ట్యాపింగ్ పై చేసిన ఫిర్యాదుపై ఆయనకు పోలీసులు ఇంత వరకు నోటీసులు ఇవ్వలేద‌న్నారు. కేవలం బీఆర్ఎస్‌ నాయకులకు మాత్రమే నోటీసుల మీద నోటీసులు ఆఘమేఘాల మీద రావడం, మీడియా లీకులు, జర్నలిస్టుల, సోషల్ మీడియా ఆక్టివిస్టుల విచ్చలవిడి అరెస్టులు, నాలుగు గోడల మధ్య జరగాల్సిన దర్యాప్తుపై గాంధీభవన్ లో కాంగ్రెస్ నాయకులు రోజూ లైవ్ కామెంటరీ ఇవ్వడం దేనికి సంకేతం? అని నిల‌దీశారు.

Read Also: హరీశ్, కవిత ఫొన్లూ ట్యాప్ అయ్యాయి: మంత్రి వివేక్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>