epaper
Friday, January 23, 2026
spot_img
epaper

చక్రబంధంలో కల్వకుంట్ల ఫ్యామిలీ

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అధికారం చేజారినప్పటి నుంచీ బీఆర్ఎస్ (BRS) వరుస సంక్షోభాలతో సతమతమవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండేండ్ల హానీమూన్ పీరియడ్ ముగిసిందని, ఇక ప్రజా సమస్యలపై ఒత్తిడి పెంచుతామని గంభీర ప్రకటనలు చేసింది. కానీ అనూహ్యంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ నేతలకు (BRS Cadre) మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నదంటూ చెప్పుకుంటున్నా అది క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలపడడానికి ఉపయోగపడలేదు. కవిత (Kavitha) సస్పెన్షన్ తర్వాత ఆమె చేస్తున్న కామెంట్లకు సమాధానం చెప్పుకోలేక, సైలెంట్‌గా ఉండలేక పార్టీలో కన్‌ఫ్యూజన్ నెలకొన్నది. ఇక కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR), హరీశ్‌రావు (Harish Rao) వివిధ రకాల కేసుల్లో ఇరుక్కోవడం, ఎంక్వయిరీలకు హాజరు కావడం, ఎప్పుడేం జరుగుతుందో తెలియని గందరగోళంతో చక్రబంధంలో చిక్కుకున్నట్లయింది.

నేతలపై కేసులతో కేడర్ కన్‌ఫ్యూజన్ :

పార్టీలో నెంబర్ 1, 2, 3 నేతలపై పలు రకాల కేసులు నమోదు కావడం, కమిషన్లతో పాటు సిట్ (SIT) ఎంక్వయిరీలు జరగడం, నివేదికలు ప్రభుత్వానికి చేరడం.. ఇవన్నీ బీఆర్ఎస్ కేడర్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎప్పుడు ఏం నోటీసులు అందుతాయో, ఎలాంటి పరిణామం చోటుచేసుకుంటుందోననే ఆందోళన వెంటాడుతున్నది. అరెస్టులపై అనుమానాలు సరేసరి. పదేండ్ల పాలనలో బంగారు తెలంగాణ సాకారమైందని చెప్పుకుంటున్నా దాని వెనక భారీ స్థాయిలో అవినీతి జరిగిందన్న వార్తలు కేడర్‌కు మింగుడుపడడంలేదు. రాజకీయ విమర్శలే అనుకున్నా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గణాంకాలు, ఆధారాలతో సహా నివేదికలో బట్టబయలు చేయడంతో విమర్శలకు దీటుగా సమాధానం చెప్పుకోవడం కత్తిమీద సాములా మారింది.

కవిత చేస్తున్న డ్యామేజ్‌తో టెన్షన్ :

కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం బీఆర్ఎస్‌లో సరికొత్త చర్చకు దారితీసింది. ఆ తర్వాత నుంచి ఆమె చేస్తున్న కామెంట్లకు సమాధానం ఇవ్వలేక, తిప్పికొట్టలేక, సైలెంట్‌గా ఉండలేక పార్టీలో కింది స్థాయి నేతల్లో అయోమయ పరిస్థితి నెలకొన్నది. “ఘాటుగా స్పందిద్దామనుకుంటే కేసీఆర్ కూతురు కావడంతో ఆచితూచి అడుగేయాల్సి వస్తున్నది.. పార్టీ నుంచి ఆదేశం లేకుండా మాట్లాడకూడదన్న ఆంక్షలు ఉన్నాయి.. ఆమె నిత్యం చేస్తున్న విమర్శలతో పార్టీకి చెడ్డపేరు వస్తున్నది.. డిఫెండ్ చేసుకోడానికి మార్గం లేకుండా పోయింది.. కూతురు కావడంతో కేసీఆర్ మౌనంగా ఉన్నారు.. సోదరి కావడంతో కేటీఆర్ సైతం అదే అనుసరిస్తున్నారు. వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నా హరీశ్‌రావు సైతం సైలెంట్‌గానే ఉంటున్నారు.. పార్టీ నేతలుగా (BRS Cadre) మేం నోరు విప్పలేకపోతున్నాం…” ఇదీ కొద్దిమంది వ్యక్తం చేసిన అభిప్రాయాలు.

అరెస్టులపై అనేక ఊహాగానాలు :

కేసుల విచారణను సీరియల్‌గా నడిపిస్తున్నారంటూ అటు పోలీసులపైనా, ఇటు ప్రభుత్వంపైనా బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ప్రజల్లో సైతం వారిని ఎప్పుడు అరెస్టు చేస్తారనే ఉత్కంఠ నెలకొన్నది. అరెస్టు చేయకుండా ప్రభుత్వం ఆలస్యం చేయడాన్ని తప్పుపడుతున్నారు. ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది… రాజకీయాలకు తావు లేదు.. ఇవి ప్రతీకార చర్యలు కానే కావు…” అంటూ అటు పోలీసులు, ఇటు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. అరెస్టు చేస్తే వారిపట్ల సానుభూతి వస్తుందనే అభిప్రాయం అన్ని పార్టీల నేతల్లోనూ నెలకొన్నది. దీంతో అరెస్టులు ఉంటాయా?.. ఎప్పుడుంటాయి?.. అది పొలిటికల్‌గా ఏ పార్టీకి మైలేజ్‌గా మారుతుంది?.. ఇలాంటి ప్రశ్నలు సాధారణ ప్రజానీకంలో వినిపిస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందోననే గుబులుతో ఉన్నారు.

Read Also: కవిత భుజంపై కాంగ్రెస్ తుపాకీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>